ఆకాశగంగా.. ( తొలివాన ముచ్చట్లు)

ఎర్రెర్ర గా కాల్చుకుతిన్న ఎండలనించీ  సూర్యుడే సెలవనీ అని పూర్తిగా కాకపోయినా కొంచం కామా పెట్టి సెలవు పుచ్చుకునే వేళ, మనం  వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా అని పిలుస్తూ ఉండగానే చిన్ననాటి చుట్టంలా ముద్దుగా వచ్చేస్తుంది ముత్యాల జల్లు కురిసే అంటూ. అంతేకాక మనం ఆనందంతో జల్లంత కవ్వింత కావాలిలే అని ఆనందిస్తూ గంతులేస్తామని ఆశ పడుతుంది కూడా. ఎవరూ అని నేను వివరంగా చెప్పాలా?? నిలుచుంటే మన ఒంటినే కాదు మనసుని కూడా తడిపే వాన

ఇలా ఎండాకాలం ముగిసిన తరవాత కూడా మాతో చాలా రోజులు దోబూచులాడి ఆపైన ఓ సాయంత్రం చల్లగా ఉండి మబ్బు పట్టిన క్షణాన మేమందరమూ ఓహో మేఘమొచ్చెనూ అని పాడేసుకుంటున్న వేళ వచ్చేసింది కురిసేను విరిజల్లులూ అనుకుంటూ..
అయితే ఆవిడ రాగానే మనం హారతులిచ్చేస్తే ఇంకేముందీ? అలుసైపోమూ అని నేను మాత్రం మనసులో ఆనందం వరదలౌతున్నా సరే పైకి బెట్టుగా ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వానా అని త్రిషలాగే గంతులేస్తూ కళ్ళెర్రచేసేసాను. పాపం దానికే బిక్క మొహం పెట్టేసుకుని స్వాతీ ముత్యపు జల్లులలో నిన్ను తడిపి ఆనందిపచేద్దామని నేను వస్తే నువ్వు  కురిసింది వానా అని పాడుకుంటావనుకుంటే ఇలా కోప్పడటం న్యాయమేనా? అని దీనంగా చూసింది. అంతే కాదు చినుకు చినుకు పడుతూ ఉంటే అన్నట్టుగా నీకొసమే వచ్చాను.. కేరళా తీరాన్ని పవనాలు కొంచం ఆలస్యంగా తాకితే నాదా తప్పు? పోనీ వెళ్ళిపోనా అంది బాధగా.

అసలే వర్షించడానికి సిద్దంగా ఉన్న కళ్ళు. సరేలే, అసలే రాక రాక వచ్చింది, ఇంకా బెట్టు చేస్తే చినుకు చినుకుగా చిగురు వెచ్చగా అని ఆవిరి అయిపోయి లగాన్ సినిమాలోలా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుందేమోనని నేను భయపడ్డాను. ఇప్పుడెలా ఈవిడని ఏడిపించాలా? అని ఆలోచిస్తున్నానా?? మా ఇంట్లో మిగతా అందరూ మాత్రం నన్ను పెద్దగా పట్టించుకోకుండా చిటపటా చినుకులూ అని మొదలెట్టేసారు. అదెలా ఉందో చూడండి..
ఊరునించీ వచ్చిన పెద్దక్కేమో బావగారిని తలిచేసుకుంటూ చిటపట చినుకులు పడుతూ ఉంటే అని సంబరపడిపోతోంది. దాని కొడుకేమో  వానా వానా వల్లప్పా పాటని రీ మిక్స్ చేసేసి వాన వల్లప్ప… వల్లప్పా.. సామిరంగా అని మెగా స్టార్ లెవెల్ లో పాడేస్తూ గుండ్రంగా తిరిగేస్తున్నాడు.

ఈ మధ్యనే పెళ్ళి కుదిరిన చిన్నక్కేమో మెల్లగా కరగనీ అని  ఎక్కడో అమెరికాలో ఉన్న తన కాబోయే శ్రీవారి మీద విరహంతో కూని రాగాలు తీసేస్తోంది. ఆ! దాని మొహం.. మా ఇంటి దగ్గర పడితే పక్క వీధిలో పడటం లేదు ఈ మధ్యన వానలు. ఎక్కడో అమెరికాలో కురిసేసి మనసుల మధ్య దూరాన్ని కరిగించెయ్యాలిట.. ఆశ.. దోశ. అనుకుంటాం కానీ ఎవరి వెర్రి వారికానందం. అయినా సరే.. దానిదీ కాళిదాసు గారిదీ ఒకటే మాటట ఈ విషయంలో ఇది మేఘ సందేశమూ అని ఫీలింగొకటి. ఇలా సందేశాలొచ్చేస్తే ఇన్ని పరికరాలూ, ఇంత విజ్ఞానమూ ఎందుకూ.. అక్కడాయన ఏం పాడేస్తున్నారో? మరి వానా వానా వెల్లువాయే !అంటున్నారేమూ. దీన్నసలు నమ్మలేం? ఈ పాటికి చెప్పేసే ఉంటుంది.. ఇక్కడ వాన పడుతోంది,ఒక్కడ నిద్ర మానేసి ఏ చినుకు నా సందేశాన్ని తెస్తుందా? అని చూస్తూ కూర్చోండీ అని. పాపం వెర్రి మానవుడు..
సరే అన్నయ్యేం చేస్తున్నాడో, అని వాడి గదిలోకి తొంగి చూసానా? కిటుకులు తెలిసిన చిట పట చినుకులు అని వీరగా తాళం వేస్తూ పాడేస్తున్నాడు. ఏవిటో మరి చినుకులకి మాత్రమే తెలిసిన వీడి కిటుకులు? ‘చినుకు చినుకు అందెలతో కాబోయే వదినమ్మెవరో వాన కాదు వాన కాదు వరదా రాజా అని వీడి గుండెల్లో నర్తిస్తోందేమో నని నా అనుమానం.
ఇక వంటింట్లో అమ్మేమో అచ్చం బొమ్మరిల్లు సినిమాలో అమ్మలా కరిగిపొమ్మంది ఒక చినుకు, కలిసి పొమ్మంది ఒక మెరుపు అనుకుంటూ పిండి కలిపేస్తోంది. అదొచ్చిందీ, ఇదొచ్చిందీ అని ఇంటిల్లిపాదీ గంతులు వేసినా పాపం అందరికీ వండి వార్చేది అమ్మేకదా..అది వానైనా సరే,, వరదైనా సరే.

వంటింట్లోంచి వాసన తగలగానే వచ్చేసారు నాన్న,  అది కూడా  వానొచ్చే వరదొచ్చేఅని కొండవీటి సిం హం  లో అన్నగారి స్టైల్ లో పాడుకుంటూ. వస్తూనే ఓహో! పకోడీలా, అయితే వెరీ గుడ్ అన్నారు మళ్ళె అదే తరహాలో.. అయితే ఈ సారి గుండమ్మ కధ స్టైల్.  పైగా ” ఈ తొలివాన మట్టివాసనా, నీ గాజుల చేతి పకొడీల వాసనా , ఆహా వర్ణింప నాతరమా! అంటూ కవిత్వం చెప్పబోతుంటే ” సరే బానేఉంది సంబరం..! టిఫిన్ ప్లేట్ చూసేసరికి వస్తుంది ఎక్కడలేని భావుకత్వమూ అని అమ్మ నవ్వుతూ అంటుంటే అమ్మ ముఖాన అందంగా మల్లె పూల వానా లా మెరిసిందొక చిరునవ్వు.
చేతిలో పకోడీల ప్లేట్ తో మడతకుర్చీలో ముడుచుకుని కూర్చుని పక్కన కిటికీలోంచీ కొత్తగ వేసిన మావిడి పిందెను చూస్తూ ఆకు చాటు పిందె తడిసే అనుకుంటున్నానో లేదో పక్కింటి బామ్మగారు “అయ్యో వడియాలెండపెట్టానర్రా” ఇంతట్లోకే చిటా పటా చిటా పటా చిందే వానా, చెట్టే లేని పూవుల్లాగా రాలే వానా అన్నట్టు వచ్చేసిందర్రా,.. మాయదారి వాన, ఊరికే అన్నారా “వాన రాకడా, ప్రాణం పోకడా అని .. అనుకుంటూ ఆయసంగా మెట్లెక్కసాగారు.
వెచ్చగా వానా, వేడిగా తాయిలమూ ఉన్నాయి కదా, సరదా గా టీ.వీ చూద్దామని అనుకున్నామో లేదో ఢాం అని పోయింది కరంట్. కొత్తేముది? ఈదురుగాలికి అని కాస్త గాలి వీయగానే మా దొరగారికి ( గవర్నమెంటు వారు)’ ముందు జాగ్రత్తగా  గుబులు పుట్టడం మామూలేకదా. ఇంకేం చేస్తాం? కబుర్లు చెప్పుకుంటూ ( నిజానికిదే బావుంది లెండి) వానా వానా వానా, నీలాకాశంలోనాఅని పాడేసుకుంటూ చూస్తూ కూర్చున్నాం.

నాట్లు పెట్టుకుని ఘల్లు ఘల్లు మని సిరిమువ్వల్లే అని రైతులంతా ఎదురుచూస్తున్నారుట, పొద్దున్న రేడియోలో చిన్నక్కా, ఏకాంబరమూ చెప్పారు అంది అమ్మ. మేమందరమూ పెద్దగా నవ్వేసాం అమ్మ మాటలకి. ” అమ్మ నీకు కల వచ్చి ఉంటుంది అని” ఎందుకంటే రైతులు ఎదురు చూడటం వరకూ నిజమే కావచ్చూ కానీ ఇంకా రేడియోలో చిన్నక్కలూ, బాలయ్యలూ ఎక్కడ ఉన్నారూ, ఉంటే గింటే ఎఫ్.ఎంలూ, మిర్చీలూ తప్ప అని? అమ్మ చిరుకోపంతో మావైపు చూస్తే నీ కళ్ళలోనా అమ్మా విరజాజి వానా అనేసాము.. అమ్మకి కోపంగా చూడటం కూడా సరిగ్గారాదు కదా పాపం.
ఇలా ఓ రెండు గంటలు కురిసి మమ్మల్ని ఆనందంలోనూ, తొలకరి జల్లులలోనూ తడిపేసి, మా ముచ్చట్లలో తనూ ముచ్చటైపోయి మెల్లిగా సెలవు పుచ్చుకుంది వాన. అప్పటివరకూ ఆకాశగంగా అన్నట్టుగాకురిసిన వాన వచ్చి వెళ్ళిందనడానికి ఇప్పుడు చూరునించీ కారుతున్న సన్నాయి నాదాలూ, తడిసి మెల్లిగా చినుకులు రాలుస్తున్న చెట్లూ, అప్పుడే కడిగినట్టున్న నల్లటి రోడ్లూ, ఖాళీ అయిపోయిన పకోడీల ప్లేట్ లూ సాక్ష్యం గా నిలిచి ఉన్నాయి. వాన వెలిసిన వేళా అని మేము అనుకుంటూ ఉండగానే మళ్ళీ మెరుపు మెరిసింది.
మల్లెపూలూ, మావిడిపళ్ళూ మోసుకొచ్చే మండు వేసవి కాలాలూ, ముగ్గులపందిళ్ళూ, మూడంకె వేయించే ముసుగులూ ముంగిట్లో నిలిపే శీతాకాలాలూ, ముసురుకునే మబ్బులూ, మెరిపించే మెరుపులతో చిరుజల్లులూ ముసురై కురిసే వానాకాలాలూ. కవిగారు చెప్పినట్టు ప్రకృతికాంత వంటినిండా  హొయలే కదా. ఇవన్నీ క్రమం తప్పకుండా మనల్ని పలకరించీ, ఆహ్లాదపరిచే నిత్యచుట్టాలే.. అందులోనూ  చినుకు తడికి చిగురు తొడిగిన పువ్వు ల్లా మనసంతా ఆనందాన్ని నింపే వానంటే మరీ ప్రత్యేక చుట్టం కదా!!!

This entry was posted in కధలూ-కబుర్లూ. Bookmark the permalink.

10 Responses to ఆకాశగంగా.. ( తొలివాన ముచ్చట్లు)

  1. psmlakshmi అంటున్నారు:

    చాలా బాగుంది. వాన పాటలన్నీ వచ్చేసినట్లేనా ఇంకా ఏమన్నా మిగిల్చారా మిగతా వాళ్ళకి.
    psmlakshmi

  2. manju అంటున్నారు:

    paatalato vaanani hushaarekkinchesaaru.chalaa chalaa baaggundi me post subhadra gaaru. baamma gaarito kudaapaadinchesaaru.Baagaaa pakodilu tinnaraa.

    • praseeda అంటున్నారు:

      మంజు గారూ.. థాంక్ యూ.. పకోడీలు భలే వున్నాయి. అమ్మ చేతివి కదా..
      మధురవాణిగారూ.. థాంక్ యూ.. మీకు కొన్ని పనికొస్తాయి.. చూసుకోండి
      కొత్తపాళీగారూ, మాల గారూ, సావిరహే గారూ.. థాంక్ యూ అండీ.
      లక్ష్మి గారూ.. థాంక్ యూ అండీ.ఇంకా చాలా రాద్దామనుకున్నా కానీ.. టైము సరిపోలేదండీ..

  3. మధురవాణి అంటున్నారు:

    అమ్మో ఎన్ని వాన పాటలో! భలే కురిపించేశారే వాన పాటలన్నీటినీ ఒకే చోట 🙂

  4. malapkumar అంటున్నారు:

    వాన పాటలన్నీ కలిపి భలే రాశారే . చాలా బాగుంది .

  5. భావన అంటున్నారు:

    బలే వుందే. మొత్తం వాన పాటలన్నీ చుట్టేసారు.. చాలా బాగా కలయ తిప్పేసారు. 🙂

  6. sundari అంటున్నారు:

    చాలా బావుంది. వాన పాటలన్నింటినీ కలిపి చక్కగా రాసారు. నాకు చాలా నచ్చింది, మాటల్లో చెప్పలేనంతగా నచ్చింది.

  7. aruna అంటున్నారు:

    miru rasina vana BLOG chala bavundi, anta kallaki katinatuga rasaru, chaduvutuvunte a patrlo linamayi poyinatuga vundi

వ్యాఖ్యానించండి