ఆక్టోపస్ పాల్ జ్యొతిష్యం….

అనగా అనగా జర్మనీ అని ఒక దేశం. ఆ దేశంలో పాల్ అని ఒక ఆక్టోపస్  గారు, మన పాల్ కి ఒక సం రక్షుకుడు. విచిత్రంగా గత రెండు సంవత్సరాలుగా ఈ ఆక్టోపస్ గారు జర్మనీ గెలుపూ ఓటముల గురించి జ్యోతిష్యం చెప్తూ ఉన్నారుట. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
1.ప్రస్తుత ఫుట్ బాల్ వరల్డ్ కప్పులో క్వార్టర్ ఫైనల్ లో జర్మనీ అర్జెంటీనాని ఓడిస్తుందని సరిగ్గా చెప్పడం జరిగింది, దానివల్ల అర్జెంటీనా అభిమానులందరూ మన పాల్ గారిని నలుచుకు తినేద్దామని డిసైడ్ అయిపోయారు. కోపంకొద్దీ. పాల్ గారి సం రక్షుకుడు మాత్రం అంతవరకూ రాదనీ, పాల్ ఇలాగే ఇంకా చాలా సంవత్సరాలు సుఖంగా ఉండి జరగబోయేది చెప్తూ ఉంటుందని అంటున్నారు.
2.రెండు గిన్నెల్లో మసెల్స్ ( పాల్ ఆహారం) పెట్టి, రెండింటిలోనూ ఒక్కో దేశపు జెండా పెడతారుట. పాల్ ఏ గిన్నెలోని ఆహారం తినడానికి ఇష్టపడితే ఆ జట్టు గెలుస్తుంది అని నమ్మకం. ప్రస్తుత వరల్డ్ కప్పులో జర్మనీ యొక్క ఐదు ఆటల ఫలితాన్నీ సరిగ్గా చెప్పిందిట, సెర్బియా తో ఓటమితో సహా. కానీ ప్రస్తుతం జరుగుతున్న సెమీ ఫైనల్ లో మాత్రం జర్మనీని కరుణించలేదుట మన పాల్. స్పెయిన్ తో జర్మనీ ఓడిపోతుందని తీర్పుట. మన దేశమ్మీద నీకింత నిర్లక్ష్యమా? అని జర్మనీ వాసులందరూ కళ్ళెర్రజేస్తున్నారుట. అంతేకాదు వీరు కూడా అర్జెంటినా వారితో పాటు పాల్ ని తినేయడానికి రెడీగా ఉంటారనడంలో సందేహం లేదు.. ఒకవేళ పాల్ చెప్పింది నిజమైతే.

ఆక్టోపస్ లకి తొమ్మిది మెదళ్ళు ఉంటాయి కనక అవి చాలా తెలివైనవి అని సం రక్షుకుడు  వాలెంసీక్ గారి అభిప్రాయం. అలా చెప్తూనే తన సహచరుడు ఈ సారి కూడా తప్పు చేసి ఉంటే బావుండునని అనుకుంటున్నారు ఎందుకంటే జర్మనీ ఓడిపోతుందని చెప్పాడు కదా అని. ఇంతకు ముందు యూరోపియన్ చాంపీన్షిప్ లో స్పెయిన్ గెలుస్తుందని చెప్పినప్పుడు అది తప్పు అయింది కదా, అలాగే ఈ సారి కూడా అవుతే బావుండుననీ, అవుతుందేమో అని అతని ఆశ. ఎందుకంటే పాపం స్నేహితుడికి ఇవాళ పెద్ద మంచిరోజు కాకపోవచ్చుననీ, అందుకే అలా చెప్పి ఉండవచ్చనీ అతని అభిప్రాయం. జర్మనీ ఓడిపోతుంది అన్నందుకు పాల్ ని అందరూ సైకిక్ ఆక్టోపస్ అని పిలుస్తున్నారుట. :)
ఇదంతా నాకు చాలా చాలా విచిత్రంగా అనిపించింది. అసలు ఇది ఎలా మొదలయిందో, ఎలా కొనసాగుతోందో అని ఆశ్చర్యం వేసింది. మీలో చాలామంది చదివే ఉంటారు ఈ పాటికే. మరొక గంటలో ఫలితం తేలనుంది. కానీ తేలేది ఎటువైపైనా పాల్ కి నిజంగానే ప్రెడిక్షన్ వచ్చు అని అనుకోవడానికే నాకు చాలా చాలా వింతగానూ, అస్సలు  నమ్మదగనిదిగానూ ఉంది. ఏమంటారు??

Posted in కధలూ-కబుర్లూ, Uncategorized | అభిప్రాయములు

పాడుతా తీయగా లో దర్శకుడు ‘క్రిష్’

‘పాడుతా తీయగా’ నాకు చాలా ఇష్టమైన కార్యక్రమాలలో ఒకటి. అనవసరమైన ఆర్భాటాలు లేకుండా, దేనికోసమైతే కార్యక్రమం రూపొందించబడిందో దానికి పూర్తి న్యాయం చేకూరుస్తూ హాయిగా జరిగే షో ఇది. గాయనీ గాయకులు కూడా వారం వారానికీ మెరుగుపడుతూ తమ ప్రతిభని ప్రదర్శిస్తున్నారు. ఇక ఈ ప్రోగ్రాం ని నిర్వహించే వారి గురించి నేను ఇప్పుడు కొత్తగా చెప్పేదేముంది? ప్రతీ వారమూ (ఒక్కోసారి రెండు వారాలకి ఒకరు) చిత్రరంగానికి సంబంధించిన ఒక వ్యక్తి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తారు గతవారానికీ, ఈ వారానికీ కూడా న్యాయనిర్ణేతగా యువ దర్శకుడు, ‘క్రిష్’ గా ప్రేక్షకులకి సుపరిచుతుడైన శ్రీ ‘జాగర్లమూడి రాధాక్రిష్ణ ‘ వచ్చారు. ఆయన గురించి రెండు మాటలు చెప్పాలనే ఇది రాస్తున్నాను.

తెలుగు సినీ పరిశ్రమలో కొత్త ఒరవడుల ప్రవేశానికి కారకులుగా చెప్పుకోదగ్గవారిలో ఇతను కూడా ఒకరు. ఈయన తీసిన సినిమాలు నేను ఇంకా చూడలేదు కనక దానిగురించి రాయను (గమ్యం సగం సగం చూసాను టీ.వీలో). కానీ అతని గురించి రాస్తాను. ఈ రెండు వారాలూ అతను మాట్లాడిన తీరూ, చెప్పిన విషయాలూ నన్నెంతో ఆకట్టుకున్నాయి. తను ఏం చెస్తున్నాడో, ఏం చెయ్యాలో తెలిసిన వ్యక్తి అనిపించింది. ఉదాహరణకి అతను మొదటగా చెప్పిన మాట ఇది. నేను మొదట ఒక కధకుడిని, కధ ప్రేక్షకులకి నచ్చేలా ఎలా చెప్పగలనా ?అని ఆలోచిస్తాను. తర్వాతే దర్శకుడిని అన్నారు. అది బాలూ గారికే కాదు, నాతో పాటు చాలా మందికి నచ్చి ఉంటుంది అని నా అభిప్రాయం. ఎందుకంటే ఏ సినిమాకైనా కధే ప్రాణం, కధే హీరో. అతను ఇంకో మాట అన్నారు మనం చెప్పే కధని మనం అంతచక్షువుతో ముందు చూడగలిగితే బాహ్య చక్షువుతో ఇతరులకి చూపించడం చాలా తేలిక అవుతుంది అని. తన కధ తనకే పూర్తిగా ఉన్నట్టు తోచకపోయినా, కధకి న్యాయం చేస్తున్నట్టు అనిపించకపోయినా అక్కడితోనే ఆ కధా చర్చని ఆపేస్తానని ఒక ఉదాహరణతో సహా చెప్పారు.

నిత్యమూ మనకి ఎదురుపడే సంఘటనలలోంచి కధలని చూడగలగటమూ ( గమ్యం సినిమా కధ ఒక టాక్సీ డ్రైవర్తో జరిగిన సంభాషణలోంచి పుట్టిందిట), వాటిని ప్రజలకి నచ్చేలా, వారు మెచ్చేలా, కొత్తగా చెప్పాలని తపన పడటమూ, ఎక్కడ ఏది ఆసక్తి దాయకంగా కనిపించినా అవి దాచుకుని తన చిత్రాలలో ఉపయోగించుకోవడమూ ఇవన్నీ అతనికి ఉన్న సునిశితమైన పరిశీలనా శక్తికి తార్కాణంగా అనిపించింది. కొత్తవారెవరైనా మంచి కధలు వినిపిస్తే తప్పకుండా దానితోనూ సినిమా తీయడానికి సిద్దం అన్నారు. సంగీతంలో తనకు తగినంత అనుభవం లేకపోయినా తనని ఈ కార్యక్రమానికి గురువుగారు పిలిచారని కూడా చెప్పారు. గాయనీ గాయకులకి తనదైన రీతిలో తన అభిప్రాయాలు సున్నితంగా చెప్పారు. ఒకరిద్దరినీ మళ్ళీ పాడమని అడిగిన తీరు కూడా ఎంతో సహజంగా ఉంది.

తనని పిలిచారు కదా అందుకని అందరినీ అవసరం లేకపోయినా పొగిడేసి ఆకాశానికి ఎత్తేయ్యాలని కానీ, అక్కరలేని అధిక ప్రసంగాలని చొప్పించాలని కానీ అతను అస్సలు ప్రయత్నించలేదు. చివరగా ఇలా అన్నారు, ‘ఒక మంచి సినిమా తీస్తే ఎలాంటి సత్కారం లభిస్తుందో తెలిసింది. ఒకప్పుడు బాలూ గారి షోకి టిక్కట్ల కోసం క్యూలలో నించుని కొట్టుకున్న నాకు ఈ రోజు ఆయన పక్కన కూర్చుని కార్యక్రమం నిర్వహించే అవకాశం కలగడమే” అని ముగించారు.

ఈ యువదర్శకుడికి మరిన్ని విజయాలు దక్కాలనీ, మంచి పేరున్న దర్శకుల కోవలోకి ఎదగాలనీ మనసారా కోరుకుంటున్నాను.

Posted in కళలూ-చిత్రాలూ, Uncategorized | అభిప్రాయములు

భారత్ బంద్- నాట్ ఏ సొల్యూషన్

ఇది నా ఒక్కదాని మాట కాదు, గవర్నమెంటు వారిది కూడా.  నిన్న దినపత్రికలలో పెట్రోలియం మరియు నాచురల్ గాసెస్ మంత్రిత్వ శాఖనించి వచ్చిన ఈ ప్రకటన శీర్షిక ఇది. ఇది  చూసాకా నాకు ఇది రాయాలనిపించింది. దాంట్లో ఇచ్చిన కొన్ని ఆసక్తి కరమైన వివరాలు ఇలా ఉన్నాయి.

1. మన దేశానికి కావలసిన మొత్తం పెట్రోల్ లో కనీసం 80 శాతం దిగుమతి చేసుకోవలసి ఉంది కనక అంతర్జాతీయ మార్కెట్లో ధరలు మరినప్పుడల్లా ఆ ప్రభావం వివిధ దేశాల మార్కెట్ ల మీద పడడం తప్పనిసరి. మనదేశం దానికి మినహాయింపేమీ కాదు కదా.

2. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం కిరోసిన్ కనీసం లీటర్ కి 19 రూపాయలు కనీసం పెంచవలసి ఉంటుంది. ఐతే ప్రస్తుతం పెంచినది మాత్రం మూడు రూపాయలేనట.

3. అలాగే గాస్ సిలెండర్ కూడా కనీసం 261 రూపాయాలు పెంచవలసి ఉంటే ఇప్పుడు 35 రూపాయలు మాత్రం పెంచారు

4. పెట్రోల్ దిగుమతి చేసుకునే దేశాలన్నింటిలోనూ మన దేశపు ధరలే తక్కువట. మన పొరుగు దేశాలతో పోల్చి మన ధరలు చూపించిన ఒక పట్టిక కూడా ఇచ్చారు.

5. 2015 నాటికి మన దేశంలో కనీసం 75% ఇళ్ళల్లో గాస్ వాడకం జరిగేలా చూడాలని గవర్నమెంట్ వారి సంకల్పం.

ఇలా చాలా చెప్పి, చివరిలో ఈ ధరల పెంపు తర్వాత కూడా ప్రభుత్వానికి 53000 కోట్ల ఖర్చు అవనే అవుతుంది. రేపు దొరకబోయే లాభాలకి ఇప్పుడు మనం చెల్లిస్తున్న చిన్న రుసుము ఈ ధరల పెంపు అన్నారు కూడా. నిజాలూ, లెక్కలూ తెలియకుండా ఊరికే భారత్ బందులూ అవీ చెయ్యవద్దని వారి అభ్యర్ధన.
ఈ వివరాలు చదివినతర్వాత దీనిలో నిజమెంత? అబద్దమెంత? అని రంధ్రాన్వేషణ చెయ్యకుండా చూద్దాం. ఇంధనాలూ తదితర వనరులూ రోజు రోజుకీ తరిగిపోతున్నాయి అనేది కాదనలేని సత్యం. పెరుగుతున్న అవసరాలూ, తరుగుతున్న వనరుల మధ్య సమన్వయం కుదరదు, దానివల్లే ఈ ధరల పెంపులూ, గలాభాలూ. దీనికీ బంద్ కీ ఏ మాత్రం సంబంధం లేకపోవడమూ ఇవి విధిగా,  చాలా రివాజుగా జరిగిపోతున్నాయి మన దేశంలో. కారణం లేకుండా జరుగుతూనే ఉన్నాయి. ఉంటాయి కూడా.

అనుకోకుండా ఒక రోజు సెలవు దొరకడం పిల్లలకీ, ఉద్యోగులకీ బానే ఉంటుంది, ఇది మాత్రమే వారికి సంతోషం కలిగించేది. వీటివల్ల దేశానికి ఆర్ధికంగా జర్గుతున్న నష్టం (ఆందోళనలూ, అల్లరులూ వదిలేద్దాం) గురించి ఆలోచించకపోతే. బందు వల్ల జరిగే నష్టం మాట అలా ఉంచితే దీనివల్ల ఒరిగేదేమిటో కూడా నాకు ఇప్పటివరకూ తెలియలేదు. పెరిగిన ధరలు తగ్గవు, ఎందుకంటే ఇది ఏ ఒక్కరి చేతుల్లోనూ లేదు. ఇవి ఇంకా పెరగకుండా ఉండేలా చూసుకోవడమే మనం చెయ్యవలసినది. దీనికీ  ప్రభుత్వం వారే కొన్ని సూచనలు చెప్పారు మన వాహనాలని నడిపేటప్పుడూ, వంట చేసేటప్పుడూ  ఇంధనం ఆదా ఎలా చేసుకోవచ్చో అని.

ఈ చిన్న చిన్న ప్రయత్నాలు తప్పనిసరిగా ఉపయోగపడతాయి కాదనలేం.  ఇవి సరిపోతాయా? అంటే ఖచ్చితంగా కాదు అనే చెప్పాలి. కుటుంబానికో నాలుగు వాహనాలూ, అడుగు దూరం వెళ్ళాలంటే కూడా కార్లూ, స్కూటర్లూ ఎక్కేసే జనం, ప్రస్తుతానికి ఉన్నాయి (??) కదా అని విచ్చలవిడిగా వాడేసుకోవడమూ ఇవన్నీ తప్పనిసరిగా మారాలి. వాడకం తగ్గిస్తే డిమాండ్ తగ్గి కనీసం ధరలు ఉన్నచోట్ల ఉంటాయి. వాడకం తగ్గాలంటే ప్రత్యాయమ్నాలైన పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్, సౌరశక్తి ఇలాంటివి యుద్ధప్రాతిపదికన అమలు కావాలి. లేకపోతే ఇవేమీ లేక త్వరలోనే నిజంగా నే కేవలం భారత్ ఒక్కటే కాదు ప్రపంచమే బందు అయిపోతుంది ఎవరి ప్రయత్నమూ లేకుండానే.

Posted in వ్యాఖ్యలూ-అభిప్రాయాలూ, Uncategorized | అభిప్రాయములు

కౌముది పత్రికలో నా “అగ్రహారం కధలు”

కౌముది వెబ్ పత్రికలో గత పద్ధెనిమిది నెలలుగా నా అసలు పేరు “వేదుల సుభద్ర” తో అగ్రహారం కధలు ప్రచురించబడుతున్నాయి. మిత్రులెవరైనా చదివి అభిప్రాయాలు చెప్తే నా తప్పొప్పులు దిద్దుకుని ఇంకా బాగా రాయడానికి నాకు అవకాశం ఉంటుంది. మీకు వీలున్నప్పుడు చదవి నాకు చెప్పండి.

www.koumudi.net

Posted in కధలూ-కబుర్లూ, Uncategorized | అభిప్రాయములు

పేరులోనేముంది?? (పేరులోనే ఉంది)

టైము: ఓ పదో ఇరవైయో సంవత్సరాలు ముందుకేసుకుందాం! కంగారుపడకండి, ఇదేమీ టీ.వీ సీరియల్ కధ కాదులెండి. పాత్రలు కానీ, పాత్రధారులు గానీ మారిపోరు. మారేవి ఉన్నాయి కొన్ని అవేవిటో చూడండి..

మీ ఫ్రెండ్ కూతురిని మీరు అడుగుతారు. ” ఏం చదువుతున్నావు తల్లీ? అని.

ఆ అమ్మాయి బీ. డీ. యెస్ అంటుంది. ఎక్కడా? మీ తరవాత ప్రశ్న.

‘డార్లింగ్ డెంటల్ కాలేజీ లో అంటుంది ఆ అమ్మాయి.

ఆ! మీకు కొద్దిగా పొలమారుతుంది.. కానీ అయినా మీరు కంగారు పడకూడదు.
మీ అబ్బాయి అడుగుతాడు.. నేను ఎం.బీ.యే చేద్దామనుకుంటున్నాను. ఎక్కడైతే బావుంటుంది.. బ్రేవ్  హార్ట్ బిజినెస్ స్కూలా? స్వీట్ హార్ట్ సక్సెస్ స్కూలా? అని.

మళ్ళీ మీకు ఆశ్చర్యమే. ఇవేం పేర్లు? సినిమాలవా? కాలేజీలవా ?అని. అంతే కాదు అప్పటికి బెటర్ హాఫ్ యూనివర్సిటీలూ, స్వీట్ నథింగ్ కాలేజీలు వచ్చేస్తాయి కదా.
ఇవన్నీ ఆంగ్లభాషమీద మనకున్న అభిమానంకొద్దీ పెట్టిన పేర్లు. మన దేశం పేరు కూడా రావాలంటే ‘ఇండియన్ లవ్లీ టెక్నొలజీ యూనివర్సిటీ’ అనో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వండర్ ఫుల్ ఎడ్యుకేషణ్ అని పెడతారేమో మరి.

మరి మన రాష్ట్ర భాషాభిమానులు ఊర్కుంటారా ఇలా అన్నీ ఇంగ్లీష్ పేర్లు పెట్టేస్తే. ‘ప్యారే భారత్ కా ప్యారా మహవిద్యాలయ్’ లాంటి పేర్లు పెట్టుకోవచ్చు.

ఇక మన భాషలో పెట్టుకోవాలంటే ‘ ప్రియమైన కాలేజీ’, మనసెరిగిన మహిలా విద్యాలయం ఇలాంటివెన్నో.

ఇప్పుడిదంతా  ఎందుకు? అని కోప్పడుతున్నారా? ఈ మధ్యన స్కూళ్ళూ, కాలేజీల పేర్లు చూసిన తర్వాత నాకొచ్చిన ఆలోచనలు ఇవి.

ఒకప్పుడు ‘నలందా’, తక్షశిలా లాంటి వాటితో మొదలు పెట్టి, ప్రముఖ ఆచార్యులూ, విద్యావేత్తలూ, సంఘ సంస్కర్తలూ ఇలాంటి పేర్లు ఉండేవి మన విద్యాలయాలకి. లేదా ఎక్కడ స్థాపించారో ఆ ప్రాంతపు ప్రాభవాన్ని గుర్తు తెచ్చేట్టుగా ఆ పేర్లు ఉండేవి.

విద్యాలయాలకే కాదు, పేరుకి కూడా ఒక విశిష్టతా, ప్రత్యేకతా ఉండేవి. ఆ నామకరణం వెనక ఎంతో ఆలోచనా, నిబద్దతా ఉండేవి.

ఇప్పుడేమో ‘లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలూ, క్యూటీ కాన్వెంట్లూ, స్వీట్ పబ్లిక్ స్కూళ్ళూ, ఇవన్నీ చూస్తే తొందరలోనె మన పిల్లలూ, వాళ్ళ పిల్లలూ ‘డార్లింగ్ యూనివర్సిటీలనించీ ‘,  ‘ జానం కాలేజీలనించీ” డిగ్రీలు తెచ్చుకుంటారేమో మరి.

ఏవిటో అంతా విష్ణు మాయ! అయినా నా పిచ్చి కానీ పేరులోనేముంది?? చదువులోనే ఏముందో తెలియనప్పుడు..

Posted in ఊహలూ-ఊసులూ, Uncategorized | అభిప్రాయములు

వేళలు లేని పనివేళలు…

ఒకప్పుడు ఆఫీస్ అంటే ఉదయం తొమ్మిదికో, పదికో మొదలయి సాయంత్రానికి ముగిసేది. శనివారం సాధారణంగా సగంసేపు ఉండెది. అలాగే కాలేజీలూ, స్కూళ్ళూనూ. ప్రతీదానికీ ఒక పద్ధతీ, తీరూ ఉండేవి. ఇప్పుడేమో ఏవిటో ఎప్పుడు మొదలవుతాయో, ఎప్పుడు ముగుస్తాయో తెలియని ఆఫీసుల వేళలు. కొన్ని పొద్దున్న పని చెస్తే, మరి కొన్ని రాత్రి. అంతేకాదు మనం పనిచేసె వివిధ దేశాల పనివేళలకనుగుణంగా మన పనివేళలు మారిపోతూ ఉంటాయి కూడా. ఇదివరకు ఇంకో విషయమేమంటే ఆఫీస్ పని అంటే ఆఫీస్ లో మాత్రం చేసుకొనేదిగా ఉండేది.. అంతేకాని ఇలా ఒక ఒళ్ళో పెట్టుకునే కంప్యూటరో, చేతిలో పట్టే బ్లాక్ బెర్రీ లో పెట్టుకుని ప్రపంచం లో ఏ మూల ఉన్నా, ఎక్కడ ఉన్నా ( చెట్టు కిందో, పుట్ట పక్కనో ఎక్కడైనా సరే) పని చేసేసుకోవడమే అన్నట్టుగా ఉండేది కాదు. మన నాన్నలూ, బాబాయిలూ, మావయ్యలూ ఎన్ని సార్లు సెలవు రోజుల్లోనూ అదీ ఆఫీసులకి వెళ్ళారో గుర్తు చేసుకోండి. ఎపుడో కొన్ని సార్లు మినహాయిస్తే. ఇప్పుడు ఇది బిజీ రోజు అని కానీ, ఇది బిజీ సీసన్ అని కానీ చెప్పడానికే లేదు.. ప్రతీరోజూ బిజీనే.. ప్రతీ రోజు ఒక కొత్త చాలెంజే. అమ్మయ్యా ఇంకొక్క రోజు గడిచింది రా బాబు అనుకుంటూ పడుకోవడమే.

త్వరగా దొరుకుతున్న అవకాశాలూ..ప్రమోషన్లూ, కార్లూ, ఇళ్ళూ, విదేశ యానాలూ, విహారా యాత్రలూ ఇవన్నీ చూడటానికీ, వినటానికీ బానే ఉంటున్నా ఎక్కడో ఎదో మిస్స్ అయిన ఫీలింగ్ మాత్రం అందరినీ మిస్స్ అవకుండా వెంటాడుతూనే ఉంది. ఎప్పుడు ఎవరు ఇంట్లో ఉంటారో తెలియదు, ఇంట్లో ఉన్నా పని ఎన్ని గంటలు పని చెయ్యల్సి వస్తుందో తెలియదు, అర్ధరాత్రీ, తెల్లవారు ఝామూ అన్న తేడా లేకుండా కాన్ ఫరెన్స్ కాల్సూ, పూర్తి చెయ్యవలసిన పనులూ, అవి మన మనసుమీదా, శరీరం మీదా తెస్తున్న ఒత్తిడులూ. వీటి గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. ఎంతమందో ఎన్నో చోట్ల ఎన్నో రకాలుగా చెప్పారు, రాసారు. వీటిని అధిగమించడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేసారు, చేస్తున్నారు. ప్రపంచం ఎంతో చిన్నది అయిపోతోంది ఒకపక్కన, నిజమే. ఎక్కడకి కావాలన్న నిమిషాల్లో వెళ్ళగలము, ఎవరితో కావలన్నా క్షణాలలో మాట్లాడేయగలం. అంతవరకూ బావుంది చిన్నదవుతున్న ప్రపంచంతో పాటు జీవితం చిన్నది అయిపోతోందా? ఇక్కడ జీవితమంటే కేవలం ‘లైఫ్ స్పాన్” అని కాదు నా భావన. జీవితాన్ని మనకి కావలసిన విధంగా, కావలసిన వారితో హాయిగా సంతోషంగా జీవించడం అని మాత్రమె. మధురాంతకం రాజారాం గారు ఒక కధలో రాస్తారు ” గ్లోబ్ అరచేతిలోకి వచ్చేస్తే చాలా? జీవితంలోకి ఆనందం రావద్దూ” అని. తరచి చూస్తే దీనికంటే పెద్ద నిజం లేదు అనిపిస్తుంది. జీవితంలోకి ఆనందం తెచ్చుకోవడం కేవలం మన చేతుల్లోనే ఉంది.. ఎందుకంటే ఇది మన జీవితం కనక.. ఎంత అందంగా ఉండాలో, ఉంచాలో నిర్ణయించుకునేది మనమే కనక.

Posted in వ్యాఖ్యలూ-అభిప్రాయాలూ, Uncategorized | అభిప్రాయములు

శాక్సోఫోన్ సరాగాలు

శ్రీ  కదిరి గోపాలనాథ్ .. ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు ఇది. మే 31వ తారీఖున బెంగళూరు లో మల్లేశ్వరం లో నరసిమ్హస్వామి దేవస్థానంలో జరిగిన గోపాలనాథ్ గారి కచేరీ చూసే అదృష్టం కలిగింది మాకు. అంత లబ్దప్రతిష్టులైన వారు ఇంకా నిర్మాణంలో ఉన్న ఆ మండపంలో కూర్చుని హాయిని గొలిపే సంగీతాన్ని పంచడం ఒక గొప్ప అనుభూతి. చల్లటి సాయంత్రపు వేళ ఆయనకి రెండు అడుగుల దూరంలో కూర్చుని చూడగలగడమూ, మహత్తరమైన ఆ సంగీతాన్ని వినగలగడమూ మాకు నిజంగా వరంలా దొరికిన అవకాశం. మాలాంటి సామాన్యులకి కూడా బాగా తెలిసిన కీర్తనలు వినిపించడం కూడా మాకు బాగా కలిసి వచ్చింది.
కేవలం పాశ్చాత్య సంగీతానికే పనికివస్తుంది అన్న అపోహ కి గురి అయిన ఈ ప్రత్యేకమైన వాయిద్యం మీద అయన కర్నాటక సంగీతాన్నీ, వివిధ రకాల సంగతులనీ పలికించిన తీరు అమోఘం. “క్షీరసాగర శయనా” అంటూ పలికితే జనం సంగీతక్షీరసాగరంలో ఓలలాడారు. “ఎందరో మహానుభావులూ” అని కీర్తిస్తే.. మీలాంటివారే మహానుభావులు అనుకున్నాము. అవసరమైన పని ఉండడంతో మేము కచేరీ చివరి వరకూ ఉండలేక. “కదన కుతూహలం” అవగానే వచ్చేసాము. ఆయన మళ్ళీ ఎప్పుడు బెంగళూరు వస్తారా అని ఎదురు చూస్తున్నాము. సంగీత సరస్వతి బ్రహ్మ గారికి ప్రత్యేకంగా సిఫార్స్ చేసి ఉంటుంది వీరి లాంటి వారిని ఆయన సృష్టించేటప్పుడు. అందుకే వారు ఆమెకి ఇంత ముద్దు బిడ్డలయ్యారు.
చివరిగా ఒక మాట. ప్రముఖ సాక్సోఫోన్ విద్వాంసుడు ( పాశ్చాత్య సంగీతంలో) కెన్నీ జీ గారూ, మన కదిరి గోపాలనాథ్ గారూ కలిసి ఒక “జుగల్ బందీ’ జరిపితే ఎలా ఎంత అద్భుతంగా ఉంటుందో కదా అనిపించింది. మా ఈ ఆశ ఎప్పటికైనా తీరుతుందో లేదో??

Posted in కళలూ-చిత్రాలూ, Uncategorized | అభిప్రాయములు