మన ఈ కార్యక్రమంలో బ్రేక్ తీసుకునే ముందు మీరొక చిన్న చిట్కా చెప్తారా? అని ఆంకరమ్మ అడుగుతుంది ఒక మహిళామణిని. ఆవిడ.. చెప్తానండీ… అని ఆలోచించి ఏదో తనకు తోచిన చిట్కా ఒకటి చెప్తుంది. దానికి ఈవిడ మెచ్చి.. ఇప్పుడు ఫలానా వారు చెప్పిన చిట్కా మరొకసారి అని మళ్ళీ చెప్పేసి ఆవిడకి ఒక ఏప్రానో, వెండికంచమో (అబ్బా.. ఆశ) బహూకరించేసి బ్రేక్ చెప్పేస్తుండి. ఇది ఒక చానల్ లోది.
మరొక చానల్ లో వంటల కార్యక్రమంలో ముక్కలు వేగేలోపో, నూనే కాగే లోపో చిట్కాలు ఆంకరమ్మలే చెప్పేస్తారుట. సరే.. ఇంకో చానల్ వారేమో మీరు కొరిన పాట వేసేముందు మీరొక చిట్కా చెప్పండి అంటారు. ఇంకోచోట నిన్నటితరపు ప్రముఖ నటి ఒకరు కూర్చుని చిట్కాపురాణం విప్పేస్తూ ఉంటారు. ఏతా వాతా నేను చెప్పేదేమంటే ఒక పదిహేను నిముషాలు మధ్యాహ్నం పూట తెలుగు చానల్స్ ని తిప్పితే కనిపించే సాధారణ పరిస్థితి ఇది.
చిన్నప్పుడు అమ్మ వనితా, వనితాజ్యొతీ ఇలాంటి పత్రికలు కొనుక్కుని అందులో కనబడే మూడో, నాలుగో చిట్కాలు ( నెలకి) ఒక చిన్న పుస్తకంలో రాసుకునేది, అవసరానికి వెతుక్కోనక్కరలేకుండా. ఇప్పుడవన్నీ లేవుకదా, ఎప్పుడు టీ.వీ పెట్టినా చక్కగా చిట్కాలే చిట్కాలు.. అయితే మరి నాకు చిర్రెందుకెత్తింది?? అనే కదా అనుమానం.. వస్తున్నా అక్కడకే. నెలకో పది అంటే రాసేవాళ్ళకీ, చదివేవాళ్ళకీ కూడా సుఖం, సరే అలాకాదు.. వారానికో పది అన్నారా,, అదీ ఓకే. రోజుకో రెండు.. సరే.. కానీండి అన్నామా, మరీ ఇలా గంటగంటకీ, నిమిష నిమిషానికీ చెప్పేస్తే ఎలా? నెలకొకసారి వచ్చే సీరియల్స్ నించీ, రోజూ వచ్చేవాటిలాగా. అయినా చెప్పేవాళ్ళు ఎన్నని చెప్తారు? వినేవాళ్ళు ఎన్ని గుర్తు పెట్టుకుంటారు? పాటిస్తారు? ఈ మధ్యన ఇంట్లోంచి పని చెయ్యడం వల్ల ఇవి చూసే మహద్భాగ్యం నాకు లభించింది అన్నమాట. అయితే నిన్నెవరు చూడమన్నారూ ఇవన్నీ అని అడగకండి. పనిగట్టుకుని చూడక్కరలేదు, ఊరికే చానెల్స్ తిప్పితే చాలు..
ఓ వరసా, వావీ లేకుండా చెప్పేస్తున్న ఈ చిట్కాలతో ఎవరికైనా చిరాకే వస్తుంది. నిన్న మధ్యాహ్నం ఒక యాంకరమ్మాయి చెప్పిన చిట్కాలు విన్నాకా నిజంగానే కోపం వచ్చింది. ఆవిడ చెప్పినవేమిటో మీరూ చూడండి.
1. వంటింట్లో సింక్ లో గిన్నెలు నిండా ఉండిపోతే బొద్దింకలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది కనక ఎప్పుడూ సింక్ నీట్ గానూ, ఖాళీగానూ ఉంచుకుంటే బొద్దింకలు రాకుండా ఉంటాయి. ఒహో!! ఎంత గొప్ప చిట్కానో!!..
2.ఇంకోటి వినండి.. రోజూ సబ్బు నీళ్ళల్లో ఒక బట్ట తడిపి దానితో వంటగది గట్టు తుడుస్తూ ఉంటే గట్టు శుభ్రంగా ఉంటుంది, క్రిమికీటకాలూ చేరకుండా ఉంటాయి అని. ఎంత కొత్త సంగతో, ఎవరికీ తెలియని విజ్ఞానం కదా! అనుకున్నాను.
దానితో నేను కూడా కొన్ని చిట్కాలు రాసేద్దామని డిసైడ్ అయిపోయాను. మీరు కూడా ఇవి చూసేసి, మీకు తెలిసిన ఇలాంటి అద్భుతమైన చిట్కాలు మన బ్లాగ్మిత్రులతో పంచేసుకోండి మరి. నా చిట్కాలివిగో.
వంటకీ, వంట ఇంటికీ సంబంధించినవి మొదట.
1. అన్నం ముద్దగానూ, మరీ పొడిగానూ లేకుండా రావాలంటే బియ్యం కొలతకి సరిగ్గా సరిపోయే నీళ్ళు మాత్రమే పొయ్యండి. అంతే!! మీ అన్నం చక్కగా మీరు కోరిన రీతిలో వస్తుంది. ( అమ్మ కూడా ఇదే చెప్పింది)
2. కూరగాయలు చక్కగా ఉడికి, మీరు అందులో వేసే మసాలాలూ అవీ వాటికి పట్టాలంటే కూరగాయలని తరిగి వండుకోండి.
3. వంట గదిలో లైట్ వేసుకుని వండుకుంటే మీరు ఏం వండుతున్నారో స్పష్టంగా కనబడుతుంది.
ఇప్పుడు సౌందర్య చిట్కాలు
1. మీ ముఖం మురికీ, ధూళీ లేకుండా శుభ్రంగా ఉండాలంటే మీరు వాడే సబ్బు పైనున్న కాగితాన్ని చింపి డస్త్ బిన్ లో వేసి ఆ తర్వాత సబ్బుతో ముఖం కడుక్కుంటే చాలా క్లీన్ గా ఉంటుంది.
2. తలలో చుండ్రూ, మురికీ పోవాలంటే తప్పకుండా వారానికొకసారైనా తప్పకుండా తలస్నానం చేస్తే మీ కేశ సౌందర్యం చక్కగా ఉంటుంది.
ప్రయాణానికి సంబంధించిన చిట్కాలు
1. మీ ప్రయాణం సుఖంగా జరగడానికో మంచి చిట్కా. ఊరు వెళ్ళేముందు తప్పకుండా టికట్ కొనుక్కోండి. అలాగే బట్టలన్నీ బాగ్ లో సద్దుకుని పెట్టుకోండి.
ఇలాంటివన్నీ నేనూ రాసేయగలను కదా.. మరి.. అందుకే మరి ఏ చానెల్ వారిని సంప్రదిదిద్దామా? అని ఆలోచిస్తున్నాను.. ఇలాంటి మహత్తరమైనవి మీకు కూడా తెలిస్తే పంపేయండి మరి.
ప్రసీద గారికి, నమస్కారములు.
చిట్కాలపై సెటైర్ బహు సున్నితంగా,హాస్యంగా చెప్పారు. బాగు, బాగు.
భవదీయుడు,
మాధవరావు.
enta baagaa raasaaru chitkaalu……-:)
రోజూ రెండు పూటలా అన్నం తింటే ఆకలేయకుండా ఉంటుంది అనే చిట్కా ఇంకా ఎవరూ చెప్పినట్లు లేదు
)
అన్నం మిగలకుండా ఉండాలంటే సరిపడా వండుకోండి.ఎక్కువ వండొద్దు.
కరెంటు పోతే వెతుక్కోకుండా ఎప్పుడు ఒక అగ్గి పెట్టె జోబు లో పెట్టుకోండి .
ఎండాకాలం లో ఎక్కువ మంచి నీళ్ళు తాగండి .
వానా కాలం లో ఎప్పుడు గొడుగు తీసుకొని వెళ్ళండి బయటకు .
మొబైల్ లో ఛార్జ్ ఐపోకుండా ఉండాలంటే ఎప్పుడు దాన్ని ఛార్జ్ చేస్తూనే వుండండి ( ఎప్పుడో ఒక సారి పేలటం సహజం)
: గొప్ప బ్లాగ్ లోక వాసుల రహస్యం :
ఎవరి మీదన్నా కోపం వుంటే ఈ సైట్ (http://blogzine.sahityaavalokanam.gen.in/search/label/%E0%B0%95%E0%B0%A5%E0%B0%B2%E0%B1%81)లో వున్నా కథలు చదివించండి . మీజోలికి ఎవరు రారు .
వామ్మో ఆ చిట్కాలు ఇంకా నయమండి బాబు ఒక నాలుగైదు ఏళ్ళ క్రితం అనుకుంటా ఆదిత్య చానెల్ లో మానసిక సమస్యలకి ఈ యాంకర్ గా చేసే పోరలు / పోరీలు సలహాలిచ్చేవ్వాళ్ళు నాకు అది చూస్తుంటే ఒక రేంజ్ లో తిక్క వచ్చేది . ఆ తరవాత ఏదో రేడియో ఛానల్ కూడా విన్నట్లు గుర్తు .
మీకు కడుపులో ఏదోగా వుందా… అయితే ఆకలేస్తోందన్న మాట. వెంటనే అన్నం తినండి..
మీకు ఎవరైనా అంటే ఇష్టం లేదా… అయితే ముఖం చిట్లించండి.
Too Good.
మా ఇంటావిడ ఊరెళ్ళింది. ఇంకొన్ని వంట చిట్కాలు చెబుదురూ!
బాగా ఒంటిమీద తెట్టు కట్టే వరకూ స్నానం చేయకండి. అది రక్షణ కవచంలా పనిచేసి, క్రిములు శరీరంలోకెళ్ళకుండా కాపాడుతుంది, పైగా మేని చాయ సూర్యరశ్మి వల్ల నల్లబడదు కూడా. ఇంకో వుపయోగమండోయ్ , అదే సబ్బు ఆదా! టట్టడాయ్.
@ మాధవరావుగారూ..నమస్కారమండీ. మీ అభినందనకి ధన్యవాదాలు
బావుంది..
@ మంజుగరూ.. బావున్నాయి కదా.థాంక్ యూ.
@ సుజతంగారూ.. నిజమేనండీ.. ఎవరూ చెప్పనేలేదు చూశారా ఈ విషయం.
@ అనురాధగారూ.. మంచి చిట్కా.
@ జాటర్ డమాల్ గారూ.. అమ్మో ఎన్ని చిట్కాలో.. బావున్నాయి.
@ శ్రావ్యగారూ.. నిజమా? అవి చూసే అదృష్టం నాకు కలగలేదండీ.
@ భావనగారూ, @ పల్ గారూ.. థాంక్ యూ.
@ శ్రిలలిత గారూ… మరే.. నిజమేనండీ.. భలే చెప్పారే.
@ శరత్ గారూ.. తప్పకుండా చెప్పేద్దాం.
@ వీర్రాజు గారూ
జాటర్ డమాల్ గారి సలహా ఆచరించే వాళ్ళు బానే ఉనట్టు ఉన్నారు..
ఇదేమి చూసారు, ఈ చిట్కాలు అన్నీ రాసి పెట్టుకొని, ప్రతి దానికీ అదే ఫాలో ఐపోమని సలహా ఇస్తుంటారు కొంతమంది.
నిజమేనండీ..
బాగుంది మీ పోస్ట్. ఇవి నా చిట్కాలు.
ప్రొద్దునే లేచిన వెంటనే పళ్ళు తోముకోండి అందువల్ల పళ్ళు తెల్లగా మెరుస్తాయి.
వేడి వేడి కాఫీ త్రాగేముందు ఉఫ్ ఉఫ్ అని ఊదుకొని త్రాగండి మూతి కాలకుండా ఉంటుంది.
శ్రీ వాసుకిగారూ.. బావున్నాయి మీ చిట్కాలు.
బాబోయ్.. నవ్వలేక చచ్చానండీ.. మీ చిట్కాలు, కామెంట్లలో చిట్కాలు చదివి.
brilliant!!