కొత్త ఇల్లూ.. కొత్త పోస్టూ..

నేను కూడా కొత్త ఇంట్లోకి మారిపోయాను. ఇక్కడ ఇంటివాళ్ళతో కొద్దిగా కష్టపడ్డాక, మొత్తానికి ఆఫీస్ కి దగ్గరగా ఉంటుంది కదా అని కొత్త ఇంట్లోకి వెళుతున్నాను. ఇదే నా కొత్త ఎడ్రస్.

http://praseeda1.blogspot.com/

కంటిన్యుటీ కొసం ఇదే పేరు ఉంచాను. అలాగే ఇక్కడ ఈ రోజు రాసిన పోస్త్ అక్కడ మొదటిదిగా ఉంచాను. చదివి మీ అందరి అభిప్రాయాలు చెప్తారని ఆశిస్తున్నాను. నాకు కొత్త ఇల్లు చూసుకోమని సలహా చెప్పడం నించీ, ఇంట్లో హాయిగా దిగి అన్నీ సర్దుకునేదాకా ఎంతో సహాయం చేసిన శ్రీమతి జ్యోతి వలబోజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

Posted in Uncategorized | మీ ఉద్దేశ్యం…

తోడుగా నడిచే తోబుట్టువులు..

ఒక అమ్మ పిల్లలందరూ ఒకేలా ఉండరు.. ఎంత అక్కాచెళ్ళెళ్ళయినా, అన్నదమ్ములైనా ఒక్కలా ఉంటారా, ఒక్కటే చేస్తారా? ఇలాంటి మాటలూ, ప్రశ్నలూ మనం తరుచూ వింటూనే ఉంటాము. ఒక చేతివేళ్ళూ ఒక్కలా ఉండవు, ఒక్క తల్లి పిల్లలూ ఒక్కలా ఉండరూ అని కూడా అంటారు. అన్నదమ్ములూ, అక్కచెళ్ళెల్లూ ఒకేలా ఉన్నా లేకపోయినా ఒకే రంగంలో కలిసి రాణించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. పైన చెప్పిన ప్రశ్నలని గురించి ఆలోచిస్తుంటే ఈ ఆలోచన వచ్చి అలాంటివారిలో కొందరిగురించి రాయాలని అనిపించింది. ఇది చదివి మీరు కూడా కొన్ని ఉదాహరణలు చెప్తే బావుంటుంది. ముందుగా సంగీతరంగాన్ని ప్రస్తావిస్తాను. తొలుతగా కర్నాటక సంగీతరంగం.

1. హైదరాబాద్ బ్రదర్స్ : కర్నాటక సంగీత రంగంలో ప్రముఖ స్థానాన్ని అలంకరించిన హైదరాబాద్ బ్రదర్స్ గా ప్రసిద్ధులైన డి. శేషాచారి, డి. రాఘవాచారి గార్లు దేశ విదేశాలలో అనేక కచేరీలు చేసిన విద్వాంసులు. ఏన్నో అవార్డులనీ, రివార్డులనీ అందుకున్నారు. తొలుత వారి తండ్రిగారైన లేటు సంగీత విద్వాన్ శ్రీ. రామానుజాచార్యుల వారివద్దా, తల్లిగారైనా శ్రీమతి సులోచనాదేవి గారి వద్దా శిక్షణ ప్రారంభించి తరవాత వారు తమదైన ప్రత్యేక శైలిని అవలంబించి ఎంతో ప్రాచుర్యాన్ని పొందారు.

హైదరాబాద్ బ్రదర్స్

2. హైదరాబాద్ సిస్టర్స్: హైదరాబాద్ సిస్టర్స్ గా ప్రసిద్ధులైన శ్రీమతి లలిత, శ్రీమతి హరిప్రియ కూడా ఎంతో పేరు గలిగిన సంగీత కళాకారిణులు. వీరు లేటు శ్రీ టీ. పద్మనాభన్ గారి దగ్గర శిక్షణ పొందారు, దేశంలో అన్ని ప్రముఖ సభలలోనూ, విదేశాలలోనూ కూడా ఎన్నో కచేరీలు నిర్వహించారు. మన తెలుగు తేజం శ్రీ రామ చంద్ర వీరిలో హరిప్రియగారి శిష్యుడు కూడా.

హైదరాబాద్ సిస్టర్స్

3. బాంబే సిస్టర్స్: శ్రీమతి శీ. సరోజ, శ్రీమతి శీ. లలిత గార్లు కూడా చాలా ప్రముఖులైన సంగీత విద్వాంసులు. వీరు హెచ్. ఏ. ఎస్ మణీ, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ మొదలైన వారి వద్ద విద్యనభ్యసించారు. అనేక కచేరీలు చేసారు.

బాంబే సిస్టర్స్

4. శూలమంగళం సిస్టర్స్: శూలమంగలం జయలక్ష్మి, రాజ్యలక్ష్మి గార్లు శూలమంగలం సిస్టర్స్ గా, యుగళ గానానికి ( ఇద్దరు చేసే కచేరీలకి) ఆద్యులుగా చెప్పబడతారు. వీరిద్దరి బాటలోనే ఆ తరవాత రాధా-జయలక్ష్మి     ( కజిన్స్), బాంబే సిస్టర్స్ మొదలైన వారు పయనించారు అని చెప్పుకోవచ్చు.

శూలమంగళం సిస్టర్స్

రాధా-జయలక్ష్మి

5. రంజని- గాయత్రి: ఈ ఇద్దరు సోదరీమణులు వోకల్ మరియూ వయొలీన్ వాదనలోనూ సుప్రసిద్దులు. టీనేజ్ నుంచే వీరిద్దరూ వయొలీన్ ప్రదర్శనలు ఇచ్చేవారు. అంతేకాక ఎంతో మంది ప్రముఖులకి పక్కవాయిద్యంగా కూడా వయోలీన్ సహకారం అందించారు. ఆ తర్వాత వోకల్ కచేరీలు కూడా ప్రారంభించి అందులో కూడా ప్రాచుర్యాన్ని పొందారు.

రంజని- గాయత్రి

6. ప్రియా సిస్టర్స్: ఫ్రియా సిస్టర్స్ గా సుపరిచుతులైన హరిప్రియ, షణ్ముఖప్రియ కూడా ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసులు. రాధా-జయలక్ష్మి గార్ల శిష్యులైన వీరిద్దరూ కూడా చిన్ననాటినించే ప్రతిభ కనపర్చిన వారు. వీరు ఇప్పుడు టీ. ఆర్ సుబ్రమనియం గారి శిష్యులు. ప్రియా సిస్టర్స్ కూడా ఎన్నో కచేరీలు చేసి ప్రశంసలూ, పురస్కారాలూ పొందారు.

ప్రియా సిస్టర్స్

7.మల్లాది బ్రదర్స్: మల్లాది శ్రీరాంకుమార్, మల్లాది రవికుమార్ మల్లాది బ్రదర్స్ గా ప్రసిద్దులు. మొదట వారి తాతగారూ, తండ్రిగార్ల దగ్గర శిక్షణ ప్రారంభించిన వీరు తర్వాత నేదునూరి కృష్ణమూర్తి గారు, వోలేటి వెంకటేశ్వర్లు గారు, శ్రీపాద పినాకపాణి గారు వంటి మహానుభావుల వద్ద విద్యాభ్యాసం చేసి త్యాగరాజ కృతుల ఆలాపనలో ప్రముఖులుగా నిలిచారు. ఎన్నో కచేరీలు చేసారు.

మల్లాది బ్రదర్స్

8. మైసూర్ బ్రదర్స్: సుప్రసిద్ధ వయొలీన్ విద్వాసుంలైన శ్రీ. మంజునాధ్, శ్రీ. నాగరాజ్ అత్యంత పేరు ప్రఖ్యతులు కలిగిన వయొలీన్ విద్వాసులు. వీరి ప్రతిభగురించి కానీ, వారి ప్రత్యేకతలని గురించి కానీ ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచవ్యాప్తంగా ఎంతో కీర్తినార్జించిన ప్రముఖులు వీరు. కలిసి ప్రదర్శనలిస్తూనే, ప్రముఖులకి పక్కవాయిద్య సహకారాన్ని కూడా అందిస్తారు.

మైసూర్ బ్రదర్స్

9.మాండలీన్ సిస్టర్స్: మాండలీన్ మీద సురాగాలు పలికించే ఈ ఇద్దరు చిన్నారులు శ్రీఉష, శిరిష అనతికాలంలోనే ఎంతో పేరు తెచ్చుకున్నారు.

మాండలీన్ సిస్టర్స్

10.రుద్రపట్నం బ్రదర్స్: రుద్రపట్నం బ్రదర్స్ గా ప్రముఖులైనా ఆర్.ఎన్. త్యాగరాజన్, ఆర్. ఎన్ తారానాథన్ గార్లకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. వీరు ప్రముఖు విద్వాసులవద్ద సంగీతాన్ని నేర్చుకున్నారు. వారిలో ప్రముఖ వయోలీన్ విద్వాసుంలు శ్రీ. టీ. చౌడయ్య గారు కూడా ఉన్నారు. మూడు తరాల సంగీత సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ప్రముఖులు వీరిద్దరూ.

రుద్రపట్నం బ్రదర్స్

వీరు మచ్చుకి కొందరు మాత్రమే. ఇంకా ఎందరో ఇలాంటి వారు ఉన్నారు. ప్రతిభావంతులైన బిడ్డల వల్ల తల్లి తండ్రులకి కలిగే ఆనందమూ, గౌరవమూ ఎంత ఆహ్లదాన్ని కలిగిస్తాయో మనందరికీ తెలుసు. అది ఒకటికి రెండితంలైతే.. ఆ భావాన్ని చెప్పడానికి మాటలుండవేమో.. వీరి  తల్లితండ్రులు నిజంగా ధన్యులు..

వీరిలో కొందరిని ప్రత్యక్షంగా చూసే అవకాశమూ, వారి అమృతగానాన్నీ, వాయిద్య విన్యాసాలనీ వినగలిగే అదృష్టం మాకు దొరకడం నిజంగా గొప్ప వరం.

ఇతరరంగాలలోని ప్రముఖ అక్కచెళ్ళెళ్ళూ, అన్నదమ్ముల గురించి మరొక టపాలో. ఇక్కడ నేను ప్రస్తావించని కళాకారులగురించి తప్పకుండా చెప్పండి.

Posted in కళలూ-చిత్రాలూ | అభిప్రాయములు

చిర్రెత్తిస్తున్న చిట్కాయణం….

మన ఈ కార్యక్రమంలో బ్రేక్ తీసుకునే ముందు మీరొక చిన్న చిట్కా చెప్తారా? అని ఆంకరమ్మ అడుగుతుంది ఒక మహిళామణిని. ఆవిడ.. చెప్తానండీ… అని ఆలోచించి ఏదో తనకు తోచిన చిట్కా ఒకటి చెప్తుంది. దానికి ఈవిడ మెచ్చి.. ఇప్పుడు ఫలానా వారు చెప్పిన చిట్కా మరొకసారి అని మళ్ళీ చెప్పేసి ఆవిడకి ఒక ఏప్రానో, వెండికంచమో (అబ్బా.. ఆశ) బహూకరించేసి బ్రేక్ చెప్పేస్తుండి. ఇది ఒక చానల్ లోది.

మరొక చానల్ లో వంటల కార్యక్రమంలో ముక్కలు వేగేలోపో, నూనే కాగే లోపో చిట్కాలు ఆంకరమ్మలే చెప్పేస్తారుట. సరే.. ఇంకో చానల్ వారేమో మీరు కొరిన పాట వేసేముందు మీరొక చిట్కా చెప్పండి అంటారు. ఇంకోచోట నిన్నటితరపు ప్రముఖ నటి ఒకరు కూర్చుని చిట్కాపురాణం విప్పేస్తూ ఉంటారు. ఏతా వాతా నేను చెప్పేదేమంటే ఒక పదిహేను నిముషాలు మధ్యాహ్నం పూట తెలుగు చానల్స్ ని తిప్పితే కనిపించే సాధారణ పరిస్థితి ఇది.

చిన్నప్పుడు అమ్మ వనితా, వనితాజ్యొతీ ఇలాంటి పత్రికలు కొనుక్కుని అందులో కనబడే మూడో, నాలుగో చిట్కాలు ( నెలకి) ఒక చిన్న పుస్తకంలో రాసుకునేది, అవసరానికి వెతుక్కోనక్కరలేకుండా. ఇప్పుడవన్నీ లేవుకదా, ఎప్పుడు టీ.వీ పెట్టినా చక్కగా చిట్కాలే చిట్కాలు.. అయితే మరి నాకు చిర్రెందుకెత్తింది?? అనే కదా అనుమానం.. వస్తున్నా అక్కడకే. నెలకో పది అంటే రాసేవాళ్ళకీ, చదివేవాళ్ళకీ కూడా సుఖం, సరే అలాకాదు.. వారానికో పది అన్నారా,, అదీ ఓకే. రోజుకో రెండు.. సరే.. కానీండి అన్నామా, మరీ ఇలా గంటగంటకీ, నిమిష నిమిషానికీ చెప్పేస్తే ఎలా? నెలకొకసారి వచ్చే సీరియల్స్ నించీ, రోజూ వచ్చేవాటిలాగా. అయినా చెప్పేవాళ్ళు ఎన్నని చెప్తారు? వినేవాళ్ళు ఎన్ని గుర్తు పెట్టుకుంటారు? పాటిస్తారు? ఈ మధ్యన ఇంట్లోంచి పని చెయ్యడం వల్ల ఇవి చూసే మహద్భాగ్యం నాకు లభించింది అన్నమాట. అయితే నిన్నెవరు చూడమన్నారూ ఇవన్నీ అని అడగకండి. పనిగట్టుకుని చూడక్కరలేదు, ఊరికే చానెల్స్ తిప్పితే చాలు..

ఓ వరసా, వావీ లేకుండా చెప్పేస్తున్న ఈ చిట్కాలతో ఎవరికైనా చిరాకే వస్తుంది.  నిన్న మధ్యాహ్నం ఒక యాంకరమ్మాయి చెప్పిన చిట్కాలు విన్నాకా నిజంగానే కోపం వచ్చింది. ఆవిడ చెప్పినవేమిటో మీరూ చూడండి.

1. వంటింట్లో సింక్ లో గిన్నెలు నిండా ఉండిపోతే బొద్దింకలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది కనక ఎప్పుడూ సింక్ నీట్ గానూ, ఖాళీగానూ ఉంచుకుంటే బొద్దింకలు రాకుండా  ఉంటాయి. ఒహో!! ఎంత గొప్ప చిట్కానో!!..
2.ఇంకోటి వినండి.. రోజూ సబ్బు నీళ్ళల్లో ఒక బట్ట తడిపి దానితో వంటగది గట్టు తుడుస్తూ ఉంటే గట్టు శుభ్రంగా ఉంటుంది, క్రిమికీటకాలూ చేరకుండా ఉంటాయి అని. ఎంత కొత్త సంగతో, ఎవరికీ తెలియని విజ్ఞానం కదా! అనుకున్నాను.

దానితో నేను కూడా కొన్ని చిట్కాలు రాసేద్దామని డిసైడ్ అయిపోయాను. మీరు కూడా ఇవి చూసేసి,  మీకు తెలిసిన ఇలాంటి అద్భుతమైన చిట్కాలు మన బ్లాగ్మిత్రులతో పంచేసుకోండి మరి.  నా చిట్కాలివిగో.

వంటకీ, వంట ఇంటికీ సంబంధించినవి మొదట.

1. అన్నం ముద్దగానూ, మరీ పొడిగానూ లేకుండా రావాలంటే బియ్యం కొలతకి సరిగ్గా సరిపోయే నీళ్ళు మాత్రమే పొయ్యండి. అంతే!! మీ అన్నం చక్కగా మీరు కోరిన రీతిలో వస్తుంది. ( అమ్మ కూడా ఇదే చెప్పింది)

2. కూరగాయలు చక్కగా ఉడికి, మీరు అందులో వేసే మసాలాలూ అవీ వాటికి పట్టాలంటే కూరగాయలని తరిగి వండుకోండి.

3. వంట గదిలో లైట్ వేసుకుని వండుకుంటే మీరు ఏం వండుతున్నారో స్పష్టంగా కనబడుతుంది.

ఇప్పుడు సౌందర్య చిట్కాలు

1. మీ ముఖం మురికీ, ధూళీ లేకుండా శుభ్రంగా ఉండాలంటే మీరు వాడే సబ్బు పైనున్న కాగితాన్ని చింపి డస్త్ బిన్ లో వేసి ఆ తర్వాత సబ్బుతో ముఖం కడుక్కుంటే చాలా క్లీన్ గా ఉంటుంది.
2. తలలో చుండ్రూ, మురికీ పోవాలంటే తప్పకుండా వారానికొకసారైనా తప్పకుండా తలస్నానం చేస్తే మీ కేశ సౌందర్యం చక్కగా ఉంటుంది.

ప్రయాణానికి సంబంధించిన చిట్కాలు
1. మీ ప్రయాణం సుఖంగా జరగడానికో మంచి చిట్కా. ఊరు వెళ్ళేముందు తప్పకుండా టికట్ కొనుక్కోండి. అలాగే బట్టలన్నీ బాగ్ లో సద్దుకుని పెట్టుకోండి.
ఇలాంటివన్నీ నేనూ రాసేయగలను కదా.. మరి.. అందుకే మరి ఏ చానెల్ వారిని సంప్రదిదిద్దామా? అని ఆలోచిస్తున్నాను.. ఇలాంటి మహత్తరమైనవి మీకు కూడా తెలిస్తే పంపేయండి మరి.

Posted in కధలూ-కబుర్లూ | అభిప్రాయములు

ఆకాశగంగా.. ( తొలివాన ముచ్చట్లు)

ఎర్రెర్ర గా కాల్చుకుతిన్న ఎండలనించీ  సూర్యుడే సెలవనీ అని పూర్తిగా కాకపోయినా కొంచం కామా పెట్టి సెలవు పుచ్చుకునే వేళ, మనం  వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా అని పిలుస్తూ ఉండగానే చిన్ననాటి చుట్టంలా ముద్దుగా వచ్చేస్తుంది ముత్యాల జల్లు కురిసే అంటూ. అంతేకాక మనం ఆనందంతో జల్లంత కవ్వింత కావాలిలే అని ఆనందిస్తూ గంతులేస్తామని ఆశ పడుతుంది కూడా. ఎవరూ అని నేను వివరంగా చెప్పాలా?? నిలుచుంటే మన ఒంటినే కాదు మనసుని కూడా తడిపే వాన

ఇలా ఎండాకాలం ముగిసిన తరవాత కూడా మాతో చాలా రోజులు దోబూచులాడి ఆపైన ఓ సాయంత్రం చల్లగా ఉండి మబ్బు పట్టిన క్షణాన మేమందరమూ ఓహో మేఘమొచ్చెనూ అని పాడేసుకుంటున్న వేళ వచ్చేసింది కురిసేను విరిజల్లులూ అనుకుంటూ..
అయితే ఆవిడ రాగానే మనం హారతులిచ్చేస్తే ఇంకేముందీ? అలుసైపోమూ అని నేను మాత్రం మనసులో ఆనందం వరదలౌతున్నా సరే పైకి బెట్టుగా ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వానా అని త్రిషలాగే గంతులేస్తూ కళ్ళెర్రచేసేసాను. పాపం దానికే బిక్క మొహం పెట్టేసుకుని స్వాతీ ముత్యపు జల్లులలో నిన్ను తడిపి ఆనందిపచేద్దామని నేను వస్తే నువ్వు  కురిసింది వానా అని పాడుకుంటావనుకుంటే ఇలా కోప్పడటం న్యాయమేనా? అని దీనంగా చూసింది. అంతే కాదు చినుకు చినుకు పడుతూ ఉంటే అన్నట్టుగా నీకొసమే వచ్చాను.. కేరళా తీరాన్ని పవనాలు కొంచం ఆలస్యంగా తాకితే నాదా తప్పు? పోనీ వెళ్ళిపోనా అంది బాధగా.

అసలే వర్షించడానికి సిద్దంగా ఉన్న కళ్ళు. సరేలే, అసలే రాక రాక వచ్చింది, ఇంకా బెట్టు చేస్తే చినుకు చినుకుగా చిగురు వెచ్చగా అని ఆవిరి అయిపోయి లగాన్ సినిమాలోలా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుందేమోనని నేను భయపడ్డాను. ఇప్పుడెలా ఈవిడని ఏడిపించాలా? అని ఆలోచిస్తున్నానా?? మా ఇంట్లో మిగతా అందరూ మాత్రం నన్ను పెద్దగా పట్టించుకోకుండా చిటపటా చినుకులూ అని మొదలెట్టేసారు. అదెలా ఉందో చూడండి..
ఊరునించీ వచ్చిన పెద్దక్కేమో బావగారిని తలిచేసుకుంటూ చిటపట చినుకులు పడుతూ ఉంటే అని సంబరపడిపోతోంది. దాని కొడుకేమో  వానా వానా వల్లప్పా పాటని రీ మిక్స్ చేసేసి వాన వల్లప్ప… వల్లప్పా.. సామిరంగా అని మెగా స్టార్ లెవెల్ లో పాడేస్తూ గుండ్రంగా తిరిగేస్తున్నాడు.

ఈ మధ్యనే పెళ్ళి కుదిరిన చిన్నక్కేమో మెల్లగా కరగనీ అని  ఎక్కడో అమెరికాలో ఉన్న తన కాబోయే శ్రీవారి మీద విరహంతో కూని రాగాలు తీసేస్తోంది. ఆ! దాని మొహం.. మా ఇంటి దగ్గర పడితే పక్క వీధిలో పడటం లేదు ఈ మధ్యన వానలు. ఎక్కడో అమెరికాలో కురిసేసి మనసుల మధ్య దూరాన్ని కరిగించెయ్యాలిట.. ఆశ.. దోశ. అనుకుంటాం కానీ ఎవరి వెర్రి వారికానందం. అయినా సరే.. దానిదీ కాళిదాసు గారిదీ ఒకటే మాటట ఈ విషయంలో ఇది మేఘ సందేశమూ అని ఫీలింగొకటి. ఇలా సందేశాలొచ్చేస్తే ఇన్ని పరికరాలూ, ఇంత విజ్ఞానమూ ఎందుకూ.. అక్కడాయన ఏం పాడేస్తున్నారో? మరి వానా వానా వెల్లువాయే !అంటున్నారేమూ. దీన్నసలు నమ్మలేం? ఈ పాటికి చెప్పేసే ఉంటుంది.. ఇక్కడ వాన పడుతోంది,ఒక్కడ నిద్ర మానేసి ఏ చినుకు నా సందేశాన్ని తెస్తుందా? అని చూస్తూ కూర్చోండీ అని. పాపం వెర్రి మానవుడు..
సరే అన్నయ్యేం చేస్తున్నాడో, అని వాడి గదిలోకి తొంగి చూసానా? కిటుకులు తెలిసిన చిట పట చినుకులు అని వీరగా తాళం వేస్తూ పాడేస్తున్నాడు. ఏవిటో మరి చినుకులకి మాత్రమే తెలిసిన వీడి కిటుకులు? ‘చినుకు చినుకు అందెలతో కాబోయే వదినమ్మెవరో వాన కాదు వాన కాదు వరదా రాజా అని వీడి గుండెల్లో నర్తిస్తోందేమో నని నా అనుమానం.
ఇక వంటింట్లో అమ్మేమో అచ్చం బొమ్మరిల్లు సినిమాలో అమ్మలా కరిగిపొమ్మంది ఒక చినుకు, కలిసి పొమ్మంది ఒక మెరుపు అనుకుంటూ పిండి కలిపేస్తోంది. అదొచ్చిందీ, ఇదొచ్చిందీ అని ఇంటిల్లిపాదీ గంతులు వేసినా పాపం అందరికీ వండి వార్చేది అమ్మేకదా..అది వానైనా సరే,, వరదైనా సరే.

వంటింట్లోంచి వాసన తగలగానే వచ్చేసారు నాన్న,  అది కూడా  వానొచ్చే వరదొచ్చేఅని కొండవీటి సిం హం  లో అన్నగారి స్టైల్ లో పాడుకుంటూ. వస్తూనే ఓహో! పకోడీలా, అయితే వెరీ గుడ్ అన్నారు మళ్ళె అదే తరహాలో.. అయితే ఈ సారి గుండమ్మ కధ స్టైల్.  పైగా ” ఈ తొలివాన మట్టివాసనా, నీ గాజుల చేతి పకొడీల వాసనా , ఆహా వర్ణింప నాతరమా! అంటూ కవిత్వం చెప్పబోతుంటే ” సరే బానేఉంది సంబరం..! టిఫిన్ ప్లేట్ చూసేసరికి వస్తుంది ఎక్కడలేని భావుకత్వమూ అని అమ్మ నవ్వుతూ అంటుంటే అమ్మ ముఖాన అందంగా మల్లె పూల వానా లా మెరిసిందొక చిరునవ్వు.
చేతిలో పకోడీల ప్లేట్ తో మడతకుర్చీలో ముడుచుకుని కూర్చుని పక్కన కిటికీలోంచీ కొత్తగ వేసిన మావిడి పిందెను చూస్తూ ఆకు చాటు పిందె తడిసే అనుకుంటున్నానో లేదో పక్కింటి బామ్మగారు “అయ్యో వడియాలెండపెట్టానర్రా” ఇంతట్లోకే చిటా పటా చిటా పటా చిందే వానా, చెట్టే లేని పూవుల్లాగా రాలే వానా అన్నట్టు వచ్చేసిందర్రా,.. మాయదారి వాన, ఊరికే అన్నారా “వాన రాకడా, ప్రాణం పోకడా అని .. అనుకుంటూ ఆయసంగా మెట్లెక్కసాగారు.
వెచ్చగా వానా, వేడిగా తాయిలమూ ఉన్నాయి కదా, సరదా గా టీ.వీ చూద్దామని అనుకున్నామో లేదో ఢాం అని పోయింది కరంట్. కొత్తేముది? ఈదురుగాలికి అని కాస్త గాలి వీయగానే మా దొరగారికి ( గవర్నమెంటు వారు)’ ముందు జాగ్రత్తగా  గుబులు పుట్టడం మామూలేకదా. ఇంకేం చేస్తాం? కబుర్లు చెప్పుకుంటూ ( నిజానికిదే బావుంది లెండి) వానా వానా వానా, నీలాకాశంలోనాఅని పాడేసుకుంటూ చూస్తూ కూర్చున్నాం.

నాట్లు పెట్టుకుని ఘల్లు ఘల్లు మని సిరిమువ్వల్లే అని రైతులంతా ఎదురుచూస్తున్నారుట, పొద్దున్న రేడియోలో చిన్నక్కా, ఏకాంబరమూ చెప్పారు అంది అమ్మ. మేమందరమూ పెద్దగా నవ్వేసాం అమ్మ మాటలకి. ” అమ్మ నీకు కల వచ్చి ఉంటుంది అని” ఎందుకంటే రైతులు ఎదురు చూడటం వరకూ నిజమే కావచ్చూ కానీ ఇంకా రేడియోలో చిన్నక్కలూ, బాలయ్యలూ ఎక్కడ ఉన్నారూ, ఉంటే గింటే ఎఫ్.ఎంలూ, మిర్చీలూ తప్ప అని? అమ్మ చిరుకోపంతో మావైపు చూస్తే నీ కళ్ళలోనా అమ్మా విరజాజి వానా అనేసాము.. అమ్మకి కోపంగా చూడటం కూడా సరిగ్గారాదు కదా పాపం.
ఇలా ఓ రెండు గంటలు కురిసి మమ్మల్ని ఆనందంలోనూ, తొలకరి జల్లులలోనూ తడిపేసి, మా ముచ్చట్లలో తనూ ముచ్చటైపోయి మెల్లిగా సెలవు పుచ్చుకుంది వాన. అప్పటివరకూ ఆకాశగంగా అన్నట్టుగాకురిసిన వాన వచ్చి వెళ్ళిందనడానికి ఇప్పుడు చూరునించీ కారుతున్న సన్నాయి నాదాలూ, తడిసి మెల్లిగా చినుకులు రాలుస్తున్న చెట్లూ, అప్పుడే కడిగినట్టున్న నల్లటి రోడ్లూ, ఖాళీ అయిపోయిన పకోడీల ప్లేట్ లూ సాక్ష్యం గా నిలిచి ఉన్నాయి. వాన వెలిసిన వేళా అని మేము అనుకుంటూ ఉండగానే మళ్ళీ మెరుపు మెరిసింది.
మల్లెపూలూ, మావిడిపళ్ళూ మోసుకొచ్చే మండు వేసవి కాలాలూ, ముగ్గులపందిళ్ళూ, మూడంకె వేయించే ముసుగులూ ముంగిట్లో నిలిపే శీతాకాలాలూ, ముసురుకునే మబ్బులూ, మెరిపించే మెరుపులతో చిరుజల్లులూ ముసురై కురిసే వానాకాలాలూ. కవిగారు చెప్పినట్టు ప్రకృతికాంత వంటినిండా  హొయలే కదా. ఇవన్నీ క్రమం తప్పకుండా మనల్ని పలకరించీ, ఆహ్లాదపరిచే నిత్యచుట్టాలే.. అందులోనూ  చినుకు తడికి చిగురు తొడిగిన పువ్వు ల్లా మనసంతా ఆనందాన్ని నింపే వానంటే మరీ ప్రత్యేక చుట్టం కదా!!!

Posted in కధలూ-కబుర్లూ | అభిప్రాయములు

కధాజగత్ విశ్లేషణ: నేను సైతం (శ్రీ పంజాల జగన్నాధం)… నేను సైతం (శ్రీ డీ.కే. చదువులబాబు) ..

ఒకటే పేరుతో ఈ రెండు కధలు కనిపించగానే కొంత ఉత్సుకత కలిగింది. దాదాపుగా ఒకే ఇతివృత్తాన్ని ఆధారంగా చేసుకుని రాసినవి అని తెలిశాకా ఉత్సుకత మరింత ఉత్సాహంగా మారింది. రెండూ ఇంచుమించు ఒకే సమస్యని ప్రతిబింబిస్తున్నాయి, ఒకటే పేరు కలిగి ఉన్నాయి కనక ఒకేచోట విశ్లేషిస్తే? అన్న ఆలోచన వచ్చింది. ఐతే ‘తురుపుముక్క ‘ గారి నిబంధన కొంత వెనక్కు తీసింది. అయినా సరే నాకెందుకో ఇది ఇలా రాస్తేనే బాగుంటుంది అని గట్టిగా అనిపించడంతో నా మౌస్ తీసుకుని ముందుకే కదిలాను ‘నేను సైతం’ అనుకుంటూ.

శ్రీ పంజాల జగన్నాధం, శ్రీ డీ.కే. చదువులబాబు గార్లచే రాయబడ్డాయి ఈ రెండు కధలూ. పిల్లలని ఎంతో ప్రేమతో, ఆప్యాయతలతో, కొండంత ఆశలతో పెంచడం తరవాత వారి నిరాదరణకు గురి కావడం, ముఖ్యపాత్రలు అపార్ధం చేసుకున్న ఇతర పాత్రల ఉదాత్తమైన ఆశయసాధన లో తామూ భాగంగా మారడం మూల కధగా రెండింటిలోనూ కనిపిస్తుంది.

తమ్ముడి బిడ్డలని సొంత బిడ్డలుగా సాకి, తన పెద్దవయసులో వారి తిరస్కారానికీ, నిరాదణలకీ గురి అయిన రాం నర్సయ్య కధ జగన్నాధం గారు రాసిన ‘నేను సైతం’. తమ్ముడూ, మరదలూ మందలించబోయినా వినని పిల్లలని చూసి విరక్తి చెందిన అతను తన గతాన్నీ, అందులో అర్ధం లేని అనుమానంతో, ఆవేశంతో తను దూరం చేసుకున్న భార్యనీ గుర్తుకు తెచ్చుకుని కలత చెందుతాడు. తరవాత తన జీవితంలో ఆమె లేక కలిగిన అగాధమంత లోటుని గుర్తించి తనని కలవాలని భద్రాచలం చేరతాడు అతను. అక్కడ మానవతకీ,అలుపెరగని సేవకీ నిదర్శనంగా నిలచిన తన భార్యనీ, ఆమెకి అన్నివిధాలా తోడుగా ఉన్న తన ప్రతిరూపాన్నీ చూసి ఆనంద పారవశ్యంలో మునిగిపోతాడు. తన వెంట తెచ్చుకున్న జి.పి.ఎఫ్, గ్రాట్యూటీ లాంటి వన్నీ ఇచ్చి ‘ నేను సైతం ‘ అనిపించుకుంటాడు.

కధా, కధనమూ బావున్న ఈ కధ తెలంగాణా మాండలీకంలో రాసినట్టుగా కనిపిస్తుంది. రాం నర్సయ్య భార్యని వదిలేసి రావడానికి కారణాలు మరింత బలంగా చూపించి ఉంటే బావుండుననిపించింది నాకు. ముగింపు మాత్రం ‘ అన్నిరోజుల తర్వాత కలిసాడు కదా అని భర్త కాళ్ళమీద పడిపోవడమూ, నన్ను క్షమించండి లాంటి రొటీన్ డైలాగులు ‘ లేకుండా సహజంగానూ, ఉన్నతంగానూ ఉంది.

ఇక ఇదే పేరుతో రాసిన చదువులబాబు గారి కధ కూడా ఒక పెద్దాయన పరంగా రాయబడింది. ఉత్తమపురుషలో చెప్పిన ఈ కధ కూడా కొడుకునెంతో ప్రేమించి, కళ్ళల్లో పెట్టుకుని పెంచి తరవాత ఆ కొడుకూ, కొడళ్ళ నిర్లక్ష్యానికీ, తిరస్కారానికీ గురి అవుతూ ఉండే అతని కధ. మనసులో కొండంత ఆవేదనతో, అశాంతితో బాధపడుతూ ఉంటాడు అతను. అయినా కూడా ఎప్పుడూ ఇల్లు పట్టకుండా ఆవారాగా తిరిగే ( అతని అభిప్రాయంలో) తిరిగే ఎదురింటి కొడుకుని చూస్తూ, అతనితో తన కొడుకుని పోల్చి చూసుకుని సంతృప్తి చెందటానికి ప్రయత్నం చేస్తుంటాడు. తనని వృద్ధాశ్రమంలో చేర్పించాలని కొడుకు ఏకపక్షనిర్ణయం తీసుకున్నప్పుడు కలత చెందిన మనసుతో తనంత తానుగా ఒక ఆశ్రమానికి వెళ్ళడానికి నిర్ణయించుకుంటాడు. అక్కడ ఆ అనాధల ఆశ్రమాన్ని నడుపుతున్నది తను రోజూ బాధ్యత లేనివాడుగా చిరాకు పడే ఎదురింటి కుర్రాడేనని తెలిసాకా, తనతో తెచ్చుకున్న దస్తావేజులూ, పట్టాలూ ఆ అబ్బాయి అనంత్ నడిపే ఆశ్రమానికి విరాళంగా ఇచ్చి ఈ ప్రయత్నానికి ‘ నేను సైతం’ అని సంతృప్తి చెందటంతో కధ ముగుస్తుంది.

ఈ కధ కూడా బాగా రాసారు. కొన్నిచోట్ల ఎదురింటి అబ్బాయిని బలవంతంగా చెడ్డవాడుగా ( చివరిలో అసలు నిజం తెలియడానికి ముందు వరకూ) చూపించే ప్రయత్నం జరిగినట్టు అనిపించింది. తన ఇంటిలో జరిగే పరిస్థుతుల ప్రభావం వల్ల ఆయన అలా అనుకుని ఉండవచ్చేమో మరి. అతని గురించి ఏమీ తెలియకుండానే తన కొడుకుతో పోల్చి తన కొడుకు మంచివాడు అని అనుకోవాలని చూడడం కూడా అతని మనస్థితినే ప్రతిబింబిస్తోంది అనుకోవాలి. అందుకే అతను తను ఆశ్రమంలో చేరడానికి వెళుతూ కూడా అనంత్ నీ, అతని నిర్లక్ష్యాన్నీ చూసి అతని తల్లి గురించి జాలి పడతాడు, ఇలాంటి కొడుకున్నందుకు ఆమె ఒకనాడు ఆశ్రమంలో చేరాల్సి వస్తుంది అని. ఇది నిజమైన మానవ నైజం అనిపించింది నాకు.

ఒకేపేరుతో రాయడమే కాక ఒకే రకమైన కధతో రాసిన ఈ రెండు కధలూ ఇంచుమించు ఒకేరకంగా సాగడమూ, ఒకే రకమైన ముగింపులతో ముగియడమూ ‘కాకతాళీయమే’ అయినా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కధాజగత్ లో కూడా ఇంచుమించు పక్కపక్కనే ఉండడం ( మధ్యలో మూడు కధల తేడాతో). కూడా చిత్రమే. ఈ రెండు కధలూ చదివినప్పుడూ, విశ్లేషించినప్పుడూ కూడా ఒక స్తితిలో నాకు ఒక్క కధే చదివిన అనుభూతి కలిగింది. అదే ఇలా ఒకే విశ్లేషణ రాయడానికి ప్రేరణ.

ఈ కధల లింకులు:

1. http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/nenu-saitam—panjala-jagannatham

2. http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/nenu-saitam–di-ke-caduvulababu

Posted in కధలూ-కబుర్లూ | మీ ఉద్దేశ్యం…

శ్రీ రమణగారి ధనలక్ష్మి.. కధాజగత్ పోటీ

మిధునం కధ మొదటిసారి చదివినప్పటినించీ నేను శ్రీ రమణ గారికి పెద్ద అభిమానిని. ఇక ప్రస్తుతం నేను ప్రస్తావించదలుచుకున్న కధ ధనలక్ష్మిని మొదటగా వారి కధాసంకలనంలో చదివాను. రమణగారి కధలలో నాకు నచ్చేది ఆద్యంతమూ ఆకట్టుకునే కధా,ఎంతో సులువుగా, అలవోకగా సాగిపోతూనే ఎక్కడా పట్టు సడలని కధనం. తీయని చెరుకురసంలా అనిపించే తేట తేట తెలుగు భాషా. ఒక్క వాక్యం కూడా ఎక్కువగా రాసినట్టు అనిపించదు,  ఏ కలం వాడతారో మరి?

గారాబంగా పెరిగిన దత్తుడు సీతారామాంజనేయులూ, అష్టవర్షాత్.. అనే మాటకి ఊపిరులూదుతూ ఎనిమిదేళ్ళకే అతని భార్య అయిన ధనలక్ష్మీ, ‘నేను ‘ అని ప్రధమ పురుషలో కధ మనకి చెప్పే పాత్రా, ఆయన బ్రాకెట్ బి.ఏ అర్ధాంగి శకుంతలా కధలో ముఖ్య పాత్రలు.రామాంజనేయులు తండ్రి ఈశ్వరయ్య గారి హయాంలో గుమాస్తాల మోసం వల్ల పోయిన ఆస్థినీ, వ్యాపారాన్ని ధనలక్ష్మి తెలివితేటల వల్ల మళ్ళీ నిలబెట్టుకోవడమే కాక, దానికి నాలుగింతలు ఎలా పెరిగారు అనేది స్థూలంగా కధ. భార్యాభర్తలిద్దరూ చదువుకోలేదు, అయినా బి.ఏ చదివిన మన కధకుడినీ(కధ ఈయన పరంగా చెప్పారు కనక సౌలభ్యం కోసం ఇలా అంటాను), చిన్నప్పుడు చదువు చెప్పిన మేస్టారినీ కూడా వారిదగ్గర పనిలో పెట్టుకుంటారు. అదీ ధనలక్ష్మి చాకచక్యం.

కధలో ప్రత్యేకతలేమిటి? అని నన్ను అడిగితే  చాలా  ఉన్నాయి. కధానాయకి ప్రదర్శించిన లక్షణాలన్నీ సమగ్రంగా పరిశీలిస్తే ఒక సరికొత్త బిజినెస్స్ మేనేజ్మెంట్ పుస్తకం రాయవచ్చు. ఇదేమాట మన కధకుడి భార్య శ్రీమతి శకుంతల కూడా అంటుంది. “ఓవర్ టైముకి ఓదార్పన్నమాట.తెలివంటే మీ చెల్లిదే. ఈ వ్యాపార మర్మాలన్నీ ఒక పుస్తకం రాయించడి. ఎం.ఏ బిజినెస్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఓ పుస్తకంగా పెట్టొచ్చు” అని. నాదీ అదే మాట. వ్యాపారానికీ బడిలో చదివిన చదువుకీ ఏ మాత్రం సంబంధం లేదు అని నిజజీవితంలో చూపించిన గొప్ప వ్యాపారవేత్తలకి నిలువెత్తు దర్పణం మన ధనలక్ష్మి.

ఆ లక్షణాలేమిటో ఇప్పుడు చూద్దాం.

1. అవకాశాన్ని గమనించడం- ఆలస్యం కాకుండా అందిపుచ్చుకోవడం : ‘చీమలకింత చక్కెర దొరకగా లేనిది మనకి నాలుగు మెతుకులు దొరకవా” అని సాధారణంగా మాట్లాడుతున్నట్టు కనిపించినా ఊరిలో ఎక్కడా పిండి మర లేదు కదా అని గమనించింది, ఆ దిశగా పావులు కదిపింది.

2. రిస్క్ తీసుకోవడం, దానిని తట్టుకోగలడమూ: ఆమె తలపెట్టిన పనిలో విజయం ఎంతవరకూ దొరుకుంది? అనేది తెలీదు, మాటకారితనం తెలియని భర్త సమర్ధత మీద నమ్మకంలేదు.  అయినా నగా నట్రా అమ్మి మిషను పెట్టడానికి సిద్దపడింది. డబ్బు తక్కువ పడితే తీర్చే ఉపాయాన్నే తనే సూచించింది కూడా. మొదట్లో ఇలా ఉన్నా తరవాత కనీసం కాలిక్యులేటెడ్ రిస్క్ కూడా లేకుండా పని సాధించుకుంటుంది. ఎరువుల వాగను విషయంలో.

3. వనరులు వినియోగం : రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ రిటెన్షన్ చాలా ముఖ్యమైనవి కదా. అందుబాటులో ఉన్నవారిని అనునయంగా చెప్పి వప్పించి ఉపయోగించుకోవడమూ. మంచితనంతోనూ, లౌక్యంతోనూ వారి మనసులు గెలుచుకోవడమూ మన ధనలక్ష్మి కి వెన్నతో పెట్టిన విద్య. మీ కష్టం ఊరికే ఉంచుకోములే అన్నయ్యా, సరుకే లాయికీ.  మీ ఇంటికి నెలకి సరిపడా సరుకులన్నీ మన కొట్లోంచే అని కధ చెప్పినతన్నీ, మల్లెపూలూ, జిలేబీలు ఇచ్చి అతని కుటుంబాన్ని ప్రసన్నం చేసుకోమని అతనికి చెప్పినా నిజానికి ప్రసన్నం చేసుకున్నది తనే. ఉపకారాన్నీ, ఉపకారులనీ ఎప్పుడూ మర్చిపోదు, సముచితంగా సత్కరిస్తుంది.

4. వ్యాపార విస్తరణ: పిండి మరతో మొదలుపెట్టినా, సున్నిపిండి దానికి జత చెయ్యడమూ ( నిజమైన వ్యాపారస్థులకి వృధా అన్న మాటే తెలియదంటారు), ఊరికెలాగూ సెంటరైపోయింది కనక ఇక్కడే మన కిరాణా కొట్టు మనం పెట్టేసుకుంటే బావుంటుంది అని కిరాణా కొట్టు పెట్టేయడమూ. తీర్థయాత్రల సదుపాయాలు ఊరందరికీ సమకూర్చడమూ, ఊరిలో స్థలం చవగ్గా దొరికితే దాని కొని గోడవున్ గా మార్చేయడమూ.. ఇవన్నీ ఆమె వ్యాపార దక్షతకి తార్కాణాలు.

5. వినియోగదారుల సంతోషం: కస్టమర్ ఈజ్ కింగ్ అన్న సూత్రాన్ని మనస్పూర్తిగా నమ్మడమే కాక ఆచరణలోనూ చూపిస్తుంది ధనలక్ష్మి. దానివల్ల పేరే కాక, నమ్మకమూ, కొత్త ఖాతాలూ సాధిస్తుంది. భర్త కక్కుర్తి దానివి అన్నా పట్టించుకోదు సరికదా. మంత్రసాని తనం ఒప్పుకున్నాకా ఎదొచ్చినా పట్టాల అంటుంది. ఇది తప్పకుండా ఆమె అంకిత భావాన్నీ, పోటీదారులలో పొడుగ్గా ఎదగాలన్న ఆమె తపననీ సూచిస్తుంది.

6. పట్టూ- విడుపూ; ఉత్తమ వ్యాపారులకి ఉండవలసిన లక్షణం పట్టూ విడుపూ ఉన్నట్టు కనపడటం. పట్టు తనదే అయినా విడిచినట్టు నటిస్తూనే భర్తని ఎంతో నేర్పుగా తన వైపు తిప్పుకుంటుంది. తన మనసులోని మాట అతని నోట వచ్చేలా చేసి కధకుడిని కూడా ఆశ్చర్య పరుస్తుంది. “ఎంత ఉన్నా సంసారంలో సుఖశాంతులు లేకపోతే ఏం లాభం?” అని కీలెరిగి వాతలు పెట్టినట్టు తెలియకుండానే పెట్టుకొని గెలుచుకుంటుంది.
ఇవన్నీ చాలవూ మన ధనలక్ష్మి తెలివి తేటలూ, వ్యవహార దక్షతా తెలియజెయ్యడానికి.

అసలు ధనలక్ష్మిలో నాకు చాలా మంది కనిపిస్తారు.
1. “అమ్మా నువ్వు నాతో ఉంటే నేను మిగతా లక్ష్ములనందరినీ వెనక్కి తెచ్చుకుంటానని” అన్నారుట వెనకటికెవరో ధైర్యలక్ష్మితో. ‘పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్న సూత్రాన్ని నమ్మి ధైర్యం గా ముందడుగు వేసినప్పుడు    ధైర్యలక్ష్మి
2. పేరులో మాత్రమె కాక జీవితంలోనూ ఎదిగే సంపదకి మారుపేరుగా నిలిచినప్పుడు ధనలక్ష్మి
3. తన కొడుకు చక్కగా చదువుకుని ‘ వాళ్ళ నాన్న లా ఉప్పూ, చింతపండు కాక ఏ.బీ.సీ.డీ లు అమ్ముకోవాలని ఆశ పడీ, దాన్ని సాధించేటప్పుడు  సంతాన లక్ష్మి
4. చీటీ డబ్బులు కట్టీ లోటు పూర్తి చేసి స్థలం కొన్నా, ఎరువుల వేగన్ విషయంలో సాహసించి నిర్ణయం తీసుకున్నప్పుడూ ఆమె భయమెరుగని  వీరలక్ష్మి.
5. మూడో క్లాస్ లో బడి చదువు ఆగిపోయినా, పదిహేడేళ్ళకే జీవితం చేదు పాఠాలు నేర్పినా వాటిలోంచి జీవితాన్ని చదువుకుని, తీర్చి దిద్దుకున్నప్పుడు విద్యాలక్ష్మి
6. తలపెట్టిన పని సున్నిపిండైనా, కిరాణా కొట్టైనా మరొకటైనా చేపట్టేది మాత్రం విజయమే అయినపుడు  విజయలక్ష్మి.
7. గజరాజులంత శక్తిమంతులనీ, నమ్మకస్థులనీ తనకు అండగా ఉంచుకుని వారందరి మన్ననలూ పొందినప్పుడు  గజలక్ష్మి.
8. విజయానికీ, ధైర్యానికీ, సంపదకీ, విద్యకీ అన్నిటింకీ మూలంగా నిలిచినప్పుడు ఆదిలక్ష్మి. ఇలా అష్టలక్ష్ములూ కనిపిస్తారు నాకు.
కధాగమనం ప్రకారం కధాస్థలం ఒక టవునుగా తోస్తుంది. అక్కడే ఇంత సాధించిన ఈవిడ మన ఆధునిక మహానగరాలలో ఉంటే ఒక సామ్రాజ్యమే స్థాపించి ఉండేది అనడంలో సందేహం లేదు. అందుకే నవీన పరిభాషలో మన ధనలక్ష్మి కి నేను పెట్టుకున్న పేరు కార్పోరేట్ కనకమహాలక్ష్మి.
నిజ జీవితంలోంచి పుట్టినట్టుండే పాత్రలూ, చక్కటి కధా, అద్భుతమైన కధనమూ, అలరించే సంభాషణలూ వెరసి ధనలక్ష్మి ఒక గొప్ప కధ.

కధాజగత్ లో ఈ కధ యొక్క లింక్: http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/dhanalaksmi—sriramana

Posted in Uncategorized | 1 వ్యాఖ్య

పదివేల గంటలు.. ఔట్ లయర్స్…

ఈ మధ్యన నేను చదివిన పుస్తకాలలో నాకు చాలా నచ్చిన వాటిలో ఇది ఒకటి. మాల్కం గ్లాడ్ వెల్ రాసిన ఈ పుస్తకం లిటిల్, బ్రౌన్ అండ్ కంపెనీ ద్వారా 2008 వ సంవత్సరంలో ప్రచురించబడింది. మాల్కం ఎప్పటిలాగే చాలా ఆసక్తి దాయకమైన విషయాలు చాలా వివరంగా వర్ణిస్తారు.

పుస్తకం మొదట్లో ఇలా అంటారు, “It’s not enough to ask what successful people are like.It is only by asking where they are from that we can unravel the logic behind who succeeds and who doesn’t.”

మామూలుగా ఔట్ లయర్స్ అనగానే మనకి గుర్తుకువచ్చే విధంగా కాక జీవితంలో చాలా చాలా సఫలత పొంది, ప్రముఖులుగా నిలిచినవారిని ఔట్ లయర్స్ గా అభివర్ణిస్తారు గ్లాడ్ వెల్. పుస్తకం లోని  రెండు భాగాలూ ‘ ‘ఆపర్ ట్యూనిటీస్ ‘  రెండో భాగం ‘లెగసీ’ లోనూ చాలా విషయాలు, సహేతుకంగా, పరిశోధనా పూర్వకమైన రుజువులతో వివరిస్తారు. కెనడా హాకీ ఆటగాళ్ళలో కొందరు మిగతావారికంటే ఎందుకు ఎక్కువ విజయం సాధించారో అనేదానితో మొదలుపెట్టి మనందరితోనూ సూపర్ సక్సెస్ ఫుల్ అనిపించుకున్న కొదరు ప్రముఖుల జీవితాలలోని సఫలత యొక్క ( బిల్ గేట్స్, బీటెల్స్ వగైరా) అనేక కోణాలని ఆవిష్కరిస్తారు.
ఇందులో ఆయన ప్రస్తావించిన ‘పదివేల గంటల సాధన ‘ అనే అంశం నాకు చాలా నచ్చింది. ఆండర్స్ ఎరిక్సన్ పరిశోధన ఆధారం గాఇది రాసానని చెపుతూ, ఇలా అంటారు. ఎంత ప్రతిభ ఉన్నా దానికి తగ్గ సాధన ఉంటేనే అది విశ్వవ్యాప్తంగా గుర్తింపుకి దోహదపడుతుంది. దీని ప్రకారం ఒక వ్యక్తి తను అనుకున్న రంగంలో అద్భుతమైన స్థానానికి చేరుకోవాలంటే 10000 వేల గంటల సాధన అవసరం అని చక్కని ఉదాహరణలతో వివరించిన తీరు నాకు చాలా నచ్చింది. బీటెల్స్, బిల్ గేట్స్ మొదలైన ప్రముఖమైన వ్యక్తులూ, గ్రూపులూ ఈ పదివేల గంటల నియమానుసారంగానే ఇంత గొప్పవారు అయ్యారని అంటారు.

మనకిష్టమైన పనిని వారానికి 20 గంటల చొప్పున పది సంవత్సరాలు చేస్తే దానిలో అత్యున్నతమైన విజయాన్ని అందుకోవచ్చని అంటారు. తనవిషయంలో కూడా అలాగే జరిగింది అని చెప్తూ, ఈ అవకాశం దొరకని వారు ఎంతో  తెలివీ, ప్రతిభా ఉండి కూడా మాములు వ్యక్తులుగా ఎలా ఉండిపోయారో చూపిస్తారు. స్వతహాగా తెలివితేటలు ఉండడం ఎంత అవసరమో, దానిని గుర్తించి ప్రోత్సహించే సరి అయిన వాతావరణమూ, అందుకు సరితూగే సాధనా ( పదివేల గంటలు) ఉన్నప్పుడే ఆ ప్రతిభ పూర్తి స్థాయిలో రాణిస్తాయనీ అంటారు. తన తల్లితండ్రులగురించీ, వారికి సరి అయిన సమయంలో దొరికిన అవకాశాల వల్ల తనకు కూడా కలిగిన లాభాలని కూడా ప్రస్తావిస్తారు. ఈ సందర్భంలో ఎంతో గొప్ప ఐ.క్యూ (195) కలిగిన క్రిస్టోఫర్ లాంగన్ అనే వ్యక్తి ని గురించి మాట్లాడుతూ అవకాశాలు దొరకకపోవడం వల్లనే ఐన్ స్టీన్ (150) కంటే కూడా ఎక్కువ ఐ.క్యూ ఉన్న అతను అతి సాధారణ జీవితాన్ని గడిపారు అంటారు.
నేను ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు తెలిసిన పరిధిలో కొంతమంది సఫలత ని విశ్లేషించుకుంటే నాకు ఇది చాలా నిజం అనిపించింది. ఈ పుస్తకం చదివిన మర్నాడే మేము ‘యేసుదాస్ ‘ గారి సంగీత కచేరీకి వెళ్ళడం జరిగింది. ఆయన ఐదు సంవత్సరాలనించీ మొదలుపెట్టిన సాధన ఇప్పటివరకూ కొనసాగిస్తూనే ఉన్నారు అంటే ఎన్ని వేల, లక్షల గంటలు చేసి ఉంటారో అనిపించింది. దైవదత్తమైన విద్యకి తోడుగా వారు చేసిన సాధన వారినింతవారిగా నిలిపి ఉంటుంది కదా అనిపించింది. ఇలాగే ఎందరో ప్రముఖులగురించి పరిశీలించినకొద్దీ వారందరూ హీనపక్షం పదివేల గంటల సాధన చేసిఉంటారనేది నిజంగా నిజం అనిపించింది.మిగతా విషయాలు ఎలా ఉన్నా తగినంత సాధన చేస్తే బంగారానికి తావి అబ్బినట్టు ప్రతిభ సరిగ్గా రాణిస్తుంది. సాధనమున పనులు సమకూరు ధరలోనా అని మన వేమన గారు కూడా అప్పుడే చెప్పారు కదా.
చక్కటి పుస్తకం. ఇప్పటివరకూ చదవనట్టైతే తప్పకుండా చదవండి. గ్లాడ్ వెల్ ఇంతకు ముందు రాసిన పుస్తకాలు “ద బ్లింక్’, టిప్పింగ్ పాయింట్ కూడా బావుంటాయి.

Posted in కధలూ-కబుర్లూ | అభిప్రాయములు